Reading Time: 2 minutes
Aman Sanger Cursor Ai Indian Founder Anysphere Ai Coding Success Story

Aman Sanger: భారతీయ యువత సత్తా ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఏలుతోంది. అవును ఇది నిజం. నమ్మకం కలగడం లేదా.. అయితే.. కేవలం నాలుగేళ్లలోనే ఐదున్నర లక్షల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించి, గ్లోబల్ ఏఐ (AI) మార్కెట్‌ను షేక్ చేసిన ఓ భారతీయ యువకుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. పాతికేళ్ల అమన్ సాంగర్ ఇండియా నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డ ఓ భారతీయ కుటుంబానికి చెందిన యువకుడు. తన అద్భుతమైన టాలెంట్‌తో నేడు ప్రపంచం మొత్తం మనవైపు తిరిగి చూసేలా చేశాడు.

పద్నాలుగేళ్ల పిన్న వయసులోనే కోడింగ్ రాయడం నేర్చుకున్న ఈ భారతీయ కుర్రాడు, కంప్యూటర్ సైన్స్ పట్ల ఉన్న అమితమైన ఇష్టంతో ప్రతిష్టాత్మక ఎమ్‌ఐటీ (MIT) లో చేరాడు. చదువుకునే రోజుల్లోనే గూగుల్‌లో ఇంటర్న్‌షిప్ చేసే బంపర్ ఆఫర్ వచ్చినా, అక్కడి కార్పొరేట్ వాతావరణం, మేనేజర్ల పర్మిషన్ల చుట్టూ తిరిగే పద్ధతులు అతనికి నచ్చలేదు. ‘సేఫ్ జోన్’ అనే భ్రమలో ఆ బంగారు పంజరంలో బంధీగా ఉండలేక, గూగుల్ ఉద్యోగాన్ని వదిలేయడమే కాకుండా తన ఎమ్‌ఐటీ చదువును సైతం మధ్యలోనే ఆపేశాడు. తనలాగే కోడింగ్‌ను ప్రాణంగా ప్రేమించే స్నేహితులు ఆసిఫ్, మైకెల్, ఆర్విడ్‌లు కూడా డిగ్రీ పట్టా కోసం ఆగితే ఏఐ రంగంలో వచ్చే అద్భుతమైన అవకాశాలను కోల్పోతామని భావించి, అమన్‌తో పాటు ఒకేసారి కాలేజీకి గుడ్‌బై చెప్పారు.

ఈ నలుగురు స్నేహితులు కలిసి 2022లో ‘ఎమీస్ఫియర్’ అనే సంస్థను స్థాపించి, మొదటి ప్రయత్నంలో ఓటమిని చవిచూశారు. అయినా.. వెనకడుగు వేయలేదు. తమకు బాగా తెలిసిన కోడింగ్ రంగంలోనే ప్రయోగాలు చేస్తూ 2023లో ‘కర్సర్.ఏఐ (Cursor.ai)’ని ప్రారంభించారు. ఇందులో వీరు రూపొందించిన ‘వైబ్ కోడింగ్’ సాంకేతికత ఐటీ ప్రపంచంలో ఒక పెద్ద సంచలనమైంది. డెవలపర్లు గంటల తరబడి కూర్చుని చేసే వెబ్‌సైట్ డిజైనింగ్‌ను, కేవలం మనసులో ఉన్న విషయాన్ని సాధారణ ఇంగ్లిష్‌లో ప్రాంప్ట్‌గా ఇస్తే చాలు, ఏఐ ఏజెంట్లు క్షణాల్లో వెబ్‌సైట్‌ను సిద్ధం చేసేలా ఈ టెక్నాలజీ అద్భుతం చేసింది.

అయితే మార్కెట్ పోటీని తట్టుకోవడానికి ఉచిత ప్లాన్‌లు ఇవ్వడం వల్ల మొదట్లో అమన్ బృందానికి భారీగా ఆర్థిక నష్టాలు వచ్చాయి. ఆ క్లిష్ట సమయంలోనే ఈ భారతీయ యువకుడికి తన తల్లిదండ్రుల నుంచి అబ్బిన వ్యాపార మెళకువలు కొండంత అండగా నిలిచాయి. అమన్ తండ్రి అరవింద్ ఐఐటీ బొంబాయి పూర్వ విద్యార్థి కాగా, అమెరికాలో ‘జియోస్ఫియర్ క్యాపిటల్’ అనే సంస్థను స్థాపించారు. అమన్ తల్లి శిల్ప సైతం ముంబయిలో పన్నెండేళ్లపాటు డెంటిస్ట్‌గా పనిచేసి, ఆ తర్వాత జియోస్ఫియర్ క్యాపిటల్‌లోనే భాగస్వామి అయ్యారు. వీరి వ్యాపార అనుభవంతో పాటు, ఎమ్‌ఐటీలో చదువుకునే రోజుల్లో ‘నియోస్కాలర్’గా ఎంపికవ్వడం వల్ల సిలికాన్‌వ్యాలీ పెట్టుబడిదారులతో అమన్‌కు మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ పరిచయాల సాయంతో గూగుల్, ఎన్విడియా, ఓపెన్ ఏఐ వంటి గ్లోబల్ దిగ్గజాల నుంచి కర్సర్‌లోకి భారీగా పెట్టుబడులు వచ్చేలా చేశాడు.

అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోని అగ్రగామి ఫార్చ్యూన్-500 కంపెనీలలో 65 శాతం సంస్థలు కర్సర్‌ను వాడటం మొదలుపెట్టాయి. ఈ అసాధారణ వృద్ధిని గమనించిన ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ (SpaceX) సంస్థ ఏకంగా ఐదున్నర లక్షల కోట్ల రూపాయల భారీ డీల్‌తో కర్సర్‌ను కొనుగోలు చేసింది. ఈ చారిత్రాత్మక విజయంతో అమన్ వ్యక్తిగత ఆస్తి విలువ సుమారు నలభై వేల కోట్లకు చేరింది. తద్వారా అతి పిన్న వయస్కుడైన భారతీయ బిలియనీర్‌గా గ్లోబల్ టెక్ రంగంలో మన దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు. వ్యాపార రంగంలోనే కాకుండా, అమెరికాలో పేరున్న స్క్వాష్ క్రీడాకారుడిగా కూడా రాణిస్తూ అమన్ సాంగర్ నేటి తరం యువతకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఒక గొప్ప రోల్ మోడల్‌గా నిలిచాడు.