
ప్రభుత్వాలు మారుతున్నా ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతులు, వైద్య సౌకర్యాలు మాత్రం మెరుగుపడటం లేదు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో అర్ధరాత్రి వేళ ఒక గర్భిణీకి ఎదురైన అనుభవం ఇక్కడి వైద్యు లీలలను కళ్ళకు కడుతోంది.
పినపాక మండలం అమరారం గ్రామానికి చెందిన కలివేటి సంధ్య అనే గర్భిణీకి అర్ధరాత్రి అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. అత్యవసర సహాయం కోసం కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ప్రయత్నించగా అది అందుబాటులో లేదు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన 108 వాహనాన్ని వేరే ప్రాంతానికి తరలించడమే దీనికి కారణం. విధిలేని పరిస్థితుల్లో వారు ఒక ఆటోను మాట్లాడుకుని సంధ్యను జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తీరా అక్కడికి వెళ్లేసరికి పీహెచ్‌సీ తాళం వేసి ఉండటంతో వారి ఆశలు అడియాశలయ్యాయి.
అక్కడి నుండి పినపాక పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సంధ్య ఆటోలోనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తొలి కాన్పు కావడంతో ఆమె పురిటి నొప్పులతో అల్లాడిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో నరకయాతన అనుభవించింది. ప్రస్తుతం మణుగూరులోని 100 పడకల ఆసుపత్రిలో తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
రాత్రి వేళల్లో పీహెచ్‌సీలు మూసి ఉంచడం, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో నిరంతర అంబులెన్స్ సౌకర్యంతో పాటు, రాత్రి వేళల్లో కూడా పీహెచ్‌సీలలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…