
పద్మారావునగర్, వెలుగు: పేద, మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైన మందులను చౌకగా అందించడమే లక్ష్యంగా సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ మినీ ఆడిటోరియంలో ‘జెనరిక్స్ ఫర్ ఆల్’ సదస్సు విజయవంతంగా జరిగింది. వారధి ట్రస్ట్, జనహిత సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ సదస్సులో వైద్య రంగ ప్రముఖులు, ఫార్మా నిపుణులు, విధాన నిర్ణేతలు, మెడికల్ స్టూడెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జెనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన, విశ్వసనీయత పెంచడం ద్వారా రోగుల ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని సదస్సు అభిప్రాయపడింది. ముఖ్య అతిథులుగా హాజరైన గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఇందిర మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు, కాబోయే డాక్టర్లు జెనరిక్ మందుల నాణ్యత, వాటి ప్రాధాన్యతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రోగుల సంక్షేమం కోసం జెనరిక్ ప్రిస్క్రిప్షన్లను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
సదస్సులో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సీఈఓ దీపక్ సప్రా, నేషనల్ మెడికల్ కమిషన్ సభ్యులు డాక్టర్ సంతోష్ కుమార్ క్రలేటి, ఫార్మా రంగ నిపుణులు వరుణ్ విహార్, శివకుమార్ బాలకృష్ణన్, గాంధీ జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ జలగం తిరుపతిరావు, యశోద ఆస్పత్రి ఆంకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ సుధా సిన్హా పాల్గొన్నారు.