
- హాస్టళ్లు, స్టడీ సర్కిళ్లు, ఓవర్సీస్ విద్యానిధిపై అధికారులతో భట్టి విక్రమార్క రివ్యూ
హైదరాబాద్, వెలుగు: సంక్షేమ హాస్టళ్లలో నెలలోగా రిపేర్లు పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రైవేట్ భవనాల్లో వసతి పొందుతున్న విద్యార్థులను సాధ్యమైనంత మేరకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు మార్చే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రజాప్రభుత్వం వచ్చాక 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మొటిక్ చార్జీలు ఒకేసారి పెంచిందని చెప్పారు. 2023 నుంచి పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.7.5 కోట్ల మరమ్మతు బిల్లులను ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
గురువారం సెక్రటేరియెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలపై డిప్యూటీ సీఎం రివ్యూ చేపట్టారు. సమావేశంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. సంక్షేమ గురుకులాలు, హాస్టళ్ల రెంట్, డైట్, కాస్మొటిక్ చార్జీలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఫైనాన్స్ డిపార్ట్ మెంట్‌కు పంపాలని ఆయా శాఖ కార్యదర్శులకు ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు సంబంధించిన బిల్లులు పంపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చిరించారు.
అంబేద్కర్ టవర్, బాబూ జగ్జీవన్ రామ్ విద్యార్థి వసతి భవనాల నిర్మాణానికి సంబంధించి నెలవారీ కార్యాaచరణ సిద్ధం చేయాలన్నారు. వచ్చే అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ బిల్డింగ్‌ను ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలన్నారు. అన్ని స్వయం ఉపాధి కార్యక్రమాలను రాజీవ్ యువ వికాసం కింద అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ఈవీ టూ వీలర్ (స్కూటర్) పథకానికి సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలన్నారు. అన్ని జిల్లాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.