
IND vs IRE: సిరీస్ డిసైడర్ అయిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా కమ్‌బ్యాక్ చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టు ఒక దశలో భారీ స్కోరు చేసేలా కనిపించినప్పటికీ.. ఆఖర్లో భారత బౌలర్లు కిల్లింగ్ బౌలింగ్‌తో కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ సిరీస్ సమం చేయాలంటే 20 ఓవర్లలో 155 రన్స్ చేయాల్సి ఉంది.
ప్రారంభంలోనే కోలుకోలేని దెబ్బ:
మొదట బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చిన ఐర్లాండ్ ఓపెనర్లకు హర్షిత్ రాణా ఆదిలోనే షాక్ ఇచ్చాడు. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద ఓపెనర్ టిమ్ టెక్టర్ (5)ను హర్షిత్ అవుట్ చేసి భారత్‌కు తొలి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ కాసేపటికే ప్రమాదకరంగా మారుతున్న మరో ఓపెనర్ రాస్ అడైర్ (16)ను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేసి పెవిలియన్ పంపాడు. ఇక ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (15) ఈ మ్యాచ్‌లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. డెబ్యూ బౌలర్ ప్రిన్స్ యాదవ్ వేసిన స్మార్ట్ డెలివరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 48 రన్స్‌కే ఐర్లాండ్ 3 కీలక వికెట్లు కోల్పోయింది.
హ్యారీ టెక్టర్ హాఫ్ సెంచరీ.. కాలిట్జ్ మెరుపులు:
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఐర్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ భారత బౌలర్లపై కౌంటర్ ఎటాక్‌కు దిగాడు. అద్భుతమైన షాట్లతో మైదానాన్ని హోరెత్తిస్తూ తన మెరుపు హాఫ్ సెంచరీ (47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 53 పరుగులు ) పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారిన అతడ్ని చివరకు ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బెంజమిన్ కాలిట్జ్ కూడా కాసేపు దూకుడుగా ఆడుతూ 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 రన్స్ చేసి శివం దూబే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
డెబ్యూ మ్యాచ్‌లోనే ప్రిన్స్ యాదవ్ అరాచకం:
ఈ మ్యాచ్‌తోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ తన బౌలింగ్‌తో నెటిజన్లను ఫ్యాన్స్ లా మార్చేసుకున్నాడు. ఏకంగా 3 వికెట్లు పడగొట్టి ఐర్లాండ్ మిడిలార్డర్ నడుము విరిచాడు. కాలిట్జ్ (37)ను అవుట్ చేసిన శివం దూబే.. ఆ తర్వాతి బంతికే గారెత్ డెలానీని గోల్డెన్ డకౌట్ చేసి ఐర్లాండ్ భారీ స్కోరు ప్లాన్స్‌ను దెబ్బతీశాడు. భారత బౌలర్లలో డెబ్యూటెంట్ ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే చెరో 2 వికెట్లు.. హర్షిత్ రాణా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, సూర్యాంశ్ షెడ్గేల బౌలింగ్‌లో ఐర్లాండ్ బ్యాటర్లు భారీగా పరుగులు రాబట్టారు.