
పాస్‌పోర్ట్, పౌరసత్వానికి సంబంధించిన అంశంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పాస్‌పోర్ట్‌లపై ఒవైసీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ప్రజా ప్రతినిధిగా, శిక్షణ పొందిన బారిస్టర్‌గా ఉన్న ఒవైసీకి పాస్‌పోర్ట్, పౌరసత్వం మధ్య ఉన్న చట్టపరమైన తేడా తెలియకపోవడం విచారకరమంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. భారత పాస్‌పోర్ట్‌కు విలువ లేదని ఎక్కడా చెప్పలేదని, కేవలం పాస్‌పోర్ట్ మాత్రమే పౌరసత్వానికి అంతిమ రుజువు కాదని మాత్రమే స్పష్టం చేసిందని వివరించారు.
భారత పౌరసత్వం అనేది రాజ్యాంగం, 1955 పౌరసత్వ చట్టం ప్రకారం నిర్ణయించబడుతుందని, ఒకే ఒక్క పత్రంతో అది నిర్ధారణ కాదని అన్నారు. 1967 పాస్‌పోర్ట్స్ చట్టం ప్రకారం పాస్‌పోర్ట్ ప్రధానంగా ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ చట్టంలోని సెక్షన్-20 ప్రకారం.. ప్రత్యేక పరిస్థితుల్లో భారత పౌరుడు కాని వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రం జారీ చేసే అధికారం కలిగి ఉందని గుర్తుచేశారు. అందువల్ల ప్రతి సందర్భంలోనూ పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి సంపూర్ణ రుజువుగా పరిగణించడం చట్టబద్ధం కాదన్నారు.
ఇది కొత్త నిబంధన కాదని, 1967లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూపొందిన పాస్‌పోర్ట్స్ చట్టంలోనే ఈ నిబంధనలు ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న చట్టానికి ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం అజ్ఞానమో, లేక ఉద్దేశపూర్వక రాజకీయ ప్రచారమో అని విమర్శించారు. 1955 పౌరసత్వ చట్టం ప్రకారం పుట్టుక, వంశపారంపర్యం, రిజిస్ట్రేషన్ లేదా సహజీకరణ ద్వారా భారత పౌరసత్వం లభిస్తుందని ఆయన వివరించారు. అలాగే 2013లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా పాస్‌పోర్ట్ ఒక్కటే పౌరసత్వానికి తుది రుజువు కాదని స్పష్టం చేశారని, ఇతర హైకోర్టులు కూడా ఇదే సూత్రాన్ని అనుసరించాయని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలాంటి కొత్త విధానాన్ని ప్రకటించలేదని, ఇప్పటికే చట్టాలు, న్యాయస్థానాలు నిర్ధారించిన అంశాన్నే మరోసారి పునరుద్ఘాటించిందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే ముందు పౌరసత్వ చట్టం-1955, పాస్‌పోర్ట్స్ చట్టం-1967లను పూర్తిగా అధ్యయనం చేయాలని ఓవైసీకి చురకలు అంటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి