
- ‘లాపతా రాహుల్’ పేరుతో పోస్టర్లు
- బీజేపీ పోస్టర్లకు కాంగ్రెస్ కౌంటర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. రాహుల్ ఎల్లప్పుడూ “వెకేషన్ మోడ్”లోనే ఉంటారని, పార్లమెంట్ సమావేశాలు, ఎన్నికలు లేదా ఆయన సొంత పార్టీకి అవసరమైన ప్రతిసారీ విదేశాలకు చెక్కేస్తారని ఎద్దేవా చేసింది. రాహుల్ తాజాగా మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో బీజేపీ ఈ వ్యాఖ్యలు చేసింది.
శుక్రవారం బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ రాహుల్ గాంధీ లోక్‌సభ ప్రతిపక్ష నేత కాదు.. ‘లీడర్ ఆఫ్ పర్యటన్’ అని విమర్శించారు. రాహుల్ విదేశీ పర్యటనలకు కోట్లాది రూపాయల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలన్నారు. అలాగే, సినిమాల పేర్లను మారుస్తూ రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తూ పోస్టర్లను వైరల్ చేస్తోంది.
‘లాపతా లేడీస్’ సినిమా పేరును ‘లాపతా రాహుల్’గా, ‘టైగర్ జిందా హై’ చిత్రాన్ని ‘టూరిస్ట్ జిందా హై’గా, ‘చక్ దే ఇండియా’, ‘పర్దేస్’ వంటి పేర్లతో బీజేపీ శ్రేణులు పోస్టర్లను విడుదల చేశాయి.బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. రాహుల్ భారతదేశానికే పరిమితమైన నాయకుడు కాదని, ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఒక గొప్ప ‘గ్లోబల్ లీడర్’గా గుర్తిస్తున్నారని కౌంటర్ ఇచ్చింది.