Reading Time: 2 minutes
Ayodhya Ram Temple Trust Resignations Donation Misuse Sit Probe

Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవలంబిస్తున్న కఠిన వైఖరి.. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో ఊహించని భారీ భూకంపానికి దారితీసింది. ఈ కుంభకోణంపై ఏర్పాటైన ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రాథమిక నివేదికలో విరాళాల నిర్వహణ, పర్యవేక్షణలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలడంతో ట్రస్ట్ కీలక సభ్యులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. సీఎం యోగి ఆదేశాలతో దర్యాప్తు ముమ్మరం కావడం, నిందితుల అరెస్ట్‌లతో ఒత్తిడి పెరగడంతోనే వీరు తమ పదవుల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో సిట్ (SIT) సిఫార్సుల మేరకు ఇప్పటికే మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మాజీ ట్రస్టీ కామేశ్వర్ చౌపాల్ మరణం తర్వాత.. సెప్టెంబర్ 2025లో ఈ బోర్డులోకి వచ్చిన కొత్త ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ అధికారికంగా ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న మెరుపు నిర్ణయాలు, తాజా రాజీనామాలతో అయోధ్య ట్రస్ట్ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఇక, అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల నమ్మకాలతో, సనాతన ధర్మ విలువలపై ఆటలాడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత ఘాటుగా స్పందించారు. ప్రజల విశ్వాసాలను స్వార్థం కోసం వాడుకునే వారి పట్ల తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ (సహించేదే లేదు) విధానాన్ని అవలంబిస్తుందని స్పష్టం చేశారు. ఆలయ విరాళాల హేరఫేరి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రాథమిక నివేదిక సమర్పించిన వెంటనే ప్రభుత్వం మెరుపు వేగంతో చర్యలు ప్రారంభించింది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన ఎనిమిది మంది నిందితులను యూపీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ కృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై దొంగతనం, నేరపూరిత విశ్వాసఘాతుకం, కుట్ర, అవినీతి వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రమాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్ శంకర్ యాదవ్ అలియాస్ తిన్ను అనే ఎనిమిది మందిని కటకటాల్లోకి నెట్టారు. తాజాగా ట్రస్ట్ సభ్యులు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.