Reading Time: 2 minutes
Kanthari Red Chilli: సూది మిరప.. చురుకైన మంట.. ఆదాయపు పంట.. ఎలా సాగు చేయాలంటే?

పరిమాణంలో చిన్నదే అయినా.. ఘాటులో దీనికి సాటి మరేదీ రాదు. నోట్లో వేస్తే అగ్నిపర్వతం బద్దలైనట్లే ఉంటుంది. అదేనండీ.. మన పెరడులో, గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల వెంబడి కనిపించే ‘సూది మిరప’. ప్రాంతాన్ని బట్టి దీనిని కాంతారి మిరప, ఆకాశ మిరప లేదా సీమ మిరప అని కూడా పిలుస్తారు. వృక్షశాస్త్ర పరంగా ‘క్యాప్సికమ్ ఫ్రూట్సెన్స్’ గా గుర్తింపు పొందిన ఈ మిరప రకం.. సాధారణంగా మార్కెట్లో దొరికే పొడుగు మిరపకాయల కంటే ఇది పూర్తిగా భిన్నమైంది భిన్నమైనది. ఎందుకంటే ఇది మిగతా మిరపకాయల్లా చెట్టుకు గుత్తులా కిందకు వేలాడకుండా.. ఆకాశం వైపు నిటారుగా చూస్తున్నట్లు మొలకెత్తడం వీటి ప్రత్యేకత. పచ్చిగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చ రంగులో ఉండి, పూర్తిగా పండిన తర్వాత ముదురు ఎరుపు రంగులోకి మారి చూసేందుకే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటి గురించి మరిన్న ఆసక్తమరమైన విషయాలు, ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం.

సూది మిరప ఘాటు రహస్యం

ఈ మిరపకాయల కారం ఘాటు సాధారణ రకాల కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయంగా మిరప ఘాటును కొలిచే ‘స్కోవిల్ స్కేల్’ పై ఈ సూది మిరప అత్యున్నత రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ అసాధారణ ఘాటుకు కారణం ఇందులో పుష్కలంగా ఉండే ‘క్యాప్సైసిన్’ అనే రసాయన సమ్మేళనమే. కొమ్మల చివరన గుత్తులు గుత్తులుగా కాసే ఈ కాయలు.. నోటికి కారం అందించడమే కాకుండా, శరీరానికి అవసరమైన ఎన్నో ఔషధ గుణాలను కూడా తనలో దాచుకున్నాయి.

సూది మిరప ఆరోగ్య ప్రయోజనాలు:

ఆధునిక జీవనశైలి వ్యాధులకు ఈ చిన్న మిరపకాయ ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో ఉండే క్యాప్సైసిన్ మానవ శరీరంలో లాలాజలం, జీర్ణరసాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుంది. తద్వారా తిన్న ఆహారం త్వరగా అరిగి, జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అలాగే, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక వరప్రసాదం. శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడం ద్వారా అనవసరమైన కొవ్వును కరిగించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం జీర్ణక్రియకే కాకుండా, ఇందులో లభించే విటమిన్ సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తాయి. దీర్ఘకాలికంగా వేధించే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్‌గా కూడా ఈ కాంతారి మిరప అద్భుతంగా పనిచేస్తుంది.

సూది మిరప సాగు విధానం

ఉష్ణమండల వాతావరణం కలిగిన మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ఇండ్ల పెరట్లలో ఈ మొక్కలను చాలా సులభంగా పెంచుకోవచ్చు. వీటికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. మొక్క ఆరోగ్యంగా పెరిగి, అధిక దిగుబడి రావాలంటే ప్రతిరోజూ కనీసం 5 నుండి 6 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. కుండీలలో లేదా నేలపై సాగు చేసినప్పుడు నేలలో ఎప్పుడూ తేమ ఉండేలా జాగ్రత్తపడాలి, అయితే వేర్ల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ముఖ్యం. ఈ మొక్కల యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే.. ఇవి బహువార్షిక రకానికి చెందినవి. అంటే, సాధారణ మిరప మొక్కల్లా ఒక పంటతో ఇవి అంతమైపోవు. సరైన సంరక్షణ, సకాలంలో ఎరువులు అందిస్తే.. ఒకసారి నాటిన మొక్క కొన్ని సంవత్సరాల పాటు నిరంతరాయంగా దిగుబడిని ఇస్తూనే ఉంటుంది.

సాంప్రదాయ వంటకాల్లోనూ డిమాండ్ ఎక్కువే..

తమదైన ప్రత్యేక రుచి, ఘాటు కారణంగా ఈ మిరపకాయలకు వంటగదిలో ప్రత్యేక స్థానం ఉంది. నోరూరించే సాంప్రదాయ పచ్చళ్లు , ఘాటైన చట్నీలు, సూప్‌లలో వీటికి ప్రత్యామ్నాయం లేదు. ముఖ్యంగా కేరళ, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ మిరపను అమితంగా ఇష్టపడతారు. మార్కెట్లో సాధారణ మిరపకాయల ధరలతో పోలిస్తే, ఈ కాంతారి లేదా సూది మిరపకాయలకు ఎప్పుడూ మంచి డిమాండ్, స్థిరమైన ధర లభిస్తాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, తోటమాలికి ఆదాయం తెచ్చిపెట్టే ఈ బుజ్జి మిరపను ప్రతి ఒక్కరూ తమ పెరట్లో పెంచుకోవడం ఎంతైనా లాభదాయకం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.