Reading Time: < 1 minute

హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు కూతవేటు దూరంలో మూడు షాపుల్లో భారీ చోరీ

Caption of Image.

హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు కూతవేటు దూరంలో ఉన్న మెయిన్ రోడ్డుపై శుక్రవారం అర్ధరాత్రి ఓ దొంగ మూడు షాపుల్లో చొరబడి భారీ చోరీకి పాల్పడటం పట్టణంలో కలకలం రేపింది.

స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మెయిన్ రోడ్డులోని రాధిక కిరాణం, లావణ్య కిరాణం, ఏ టూ జడ్ తెలంగాణ బజార్ షాపుల తాళాలు పగులగొట్టిన దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. రాధిక కిరాణం నుంచి 9.50 తులాల బంగారం, 15 తులాల వెండి, రూ.40 వేలు, లావణ్య కిరాణం నుంచి రూ.30 వేలు,  ఏ టూ జడ్ తెలంగాణ బజార్ నుంచి రూ.3,500 నగదును అపహరించుకుపోయాడు.

షాపుల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఈ చోరీకి పాల్పడింది ఒక్కడేనని గుర్తించారు.  సిద్దిపేట నుంచి వచ్చిన క్లూస్ టీం ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ఘటన జరగడంతో రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ నామమాత్రంగానే సాగుతోందని, అధికారుల నిర్లక్ష్యం వల్లే దొంగలు రెచ్చిపోతున్నారని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.