Reading Time: 2 minutes
Vishnu Vishal Reveals Autoimmune Disease Breaks Silence On Health Rumours

Vishnu Vishal : సెలబ్రిటీల జీవితాల్లో ఏ చిన్న మార్పు కనిపించినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా అఫైర్స్, ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు అయితే క్షణాల్లో వైరల్ అవుతాయి. అలాంటి పరిస్థితినే తాజాగా తమిళ నటుడు విష్ణు విశాల్ ఎదుర్కొన్నారు. ఇటీవల ఆయన ఫోటోల్లో ముఖం ఉబ్బినట్లు, అలసిపోయినట్లు కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కొందరు ఆయన ఆరోగ్యంపై రకరకాల కథనాలు ప్రచారం చేయగా, మరికొందరు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ పోస్టులు చేశారు. చివరకు ఈ రూమర్లన్నింటికీ స్వయంగా విష్ణు విశాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించి అసలు విషయాన్ని వెల్లడించారు.

తన సందేశంలో విష్ణు విశాల్ గత నాలుగు సంవత్సరాలుగా తాను ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్నానని వెల్లడించారు. ఈ వ్యాధి చికిత్సలో భాగంగా వైద్యులు సూచించిన పవర్ఫుల్ మందులు వాడుతున్నానని, వాటి కారణంగానే ముఖం ఉబ్బడం, నీరసం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం ఈ చికిత్సను కొనసాగించడం తన ఆరోగ్యానికి అత్యంత అవసరమని, అందుకే శారీరకంగా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయని అభిమానులకు స్పష్టం చేశారు. అంతేకాదు తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ప్రేమ, మద్దతే తనకు మానసిక బలాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. తన జీవితంలో ఈ క్లిష్ట సమయంలో కూడా అందరూ అండగా నిలవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన ఎమోషనల్ గా రాశారు.

ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ తన బాధ్యతలను మాత్రం వదులుకోలేదని విష్ణు విశాల్ చెప్పారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘గట్ట కుస్తీ 2’ చిత్రం కోసం మొత్తం యూనిట్ ఎంతో కష్టపడిందని, వారి శ్రమను గౌరవిస్తూ తన ఆరోగ్యం పూర్తిగా సహకరించకపోయినా ప్రమోషన్లలో పాల్గొంటున్నానని వెల్లడించారు. హెల్త్ ఇష్యూస్ పక్కనబెట్టి ప్రేక్షకులను కలవడానికి వస్తున్నానని, ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. జూలై 3న థియేటర్లలో విడుదల కానున్న ‘గట్ట కుస్తీ 2’ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని విష్ణు విశాల్ తెలిపారు. త్వరలోనే పూర్తిగా కోలుకుని మరింత ఉత్సాహంతో అభిమానుల ముందుకు వస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్నారు.

తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన విష్ణు విశాల్, ‘అరణ్య’, ‘ఎఫ్‌ఐఆర్’ వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలను వివాహం చేసుకోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలాంటి నటుడి ఆరోగ్యంపై వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.