
తెలంగాణలో కోడిగుడ్డు సామాన్యుడికి క్రమంగా దూరమవుతోంది. నిన్నమొన్నటి వరకు ఒక్కో గుడ్డు ధర ఆరు రూపాయల పలికిన మార్కెట్‌లో.. ఇప్పుడు ఒక్కసారిగా రెండు రూపాయలు పెరిగి కస్టమర్లకు షాక్ ఇస్తోంది. ఇటీవల కాలంలో నమోదైన తీవ్రమైన ఎండలు, వడగాల్పుల (హీట్ వేవ్) ప్రభావం పౌల్ట్రీ రంగంపై తీవ్రంగా పడింది. ఎండ తీవ్రతకు కోళ్లు సరిగ్గా మేత తినక, నీరసించిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ అకస్మాత్తు ఉత్పత్తి కొరత కారణంగానే స్థానిక మార్కెట్లలో ధరలు ఒక్కసారిగా రెక్కలు తొడిగాయి.
మరోవైపు తెలంగాణలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లలో దాదాపు సగం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం గుడ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. స్థానికంగా ఉత్పత్తి తగ్గినా, ఒప్పందాల ప్రకారం పెద్ద ఎత్తున గుడ్లను ఆయా రాష్ట్రాలకు తరలిస్తుండటంతో.. తెలంగాణ స్థానిక మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడి ధరలు మరింత పెరిగాయి. దీనికి తోడు కోళ్లకు పెట్టే దాణా సోయాబీన్, జొన్నలు, మొక్కజొన్న ధరలు, రవాణా ఖర్చులు, పెట్రోల్, మందుల ధరలు కూడా బాగా పెరగడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఒక్కో గుడ్డు ఉత్పత్తి చేయడానికి రైతుకే దాదాపు 7 రూపాయల వరకు ఖర్చవుతోందని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సామాన్యుడికి గుడ్డు భారంగానే మారేలా ఉంది. రాబోయే రోజుల్లో వర్షాలు పడి, వాతావరణం చల్లబడితే తప్ప కోళ్ల ఫారాలలో ఉత్పత్తి మళ్లీ సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. అప్పటివరకు ఈ ధరల మంట తప్పేలా లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర ఇప్పటికే 8 రూపాయల మార్కును దాటేసింది. రానున్న రోజుల్లో సప్లై మరింత తగ్గితే, కొన్ని చోట్ల రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర 10 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ధరల పెరుగుదల పౌల్ట్రీ రైతులకు కొంత ఊరటనిస్తున్నా, వినియోగదారుల జేబులకు మాత్రం భారీగా చిల్లులు పెడుతోంది.