Reading Time: < 1 minute
Cm Chandrababu To Visit Markapuram Veligonda Project Review %e2%82%b9300 Crore Compensation Distribution

CM Chandrababu Markapuram Tour: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మార్కాపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు. అలాగే గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉదయం 10.45 గంటలకు దోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రహదారి మార్గంలో ప్రాజెక్టు వద్దకు వెళ్లి అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. జూలై నెల తొలి దశ లక్ష్యాలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో వేగంగా కొనసాగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేసి, లబ్ధిదారులు, రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

ఇక, మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.55 గంటలకు గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లెకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభించి, లబ్ధిదారులు, వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. సంజీవని కార్యక్రమం అమలు తీరుపై ఆరా తీస్తూ ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించనున్నారు. తదుపరి మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రజావేదిక వద్ద జరిగే సభలో పాల్గొని ప్రసంగించనున్న ముఖ్యమంత్రి, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.35 గంటల నుంచి సాయంత్రం వరకు టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో పాల్గొని పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. సాయంత్రం హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి అమరావతి (ఉండవల్లి నివాసం)కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఒకే రోజులో యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.