
నటుడు ప్రియదర్శి, నాగదుర్గ కాంబినేషన్ లో బన్నివాసు నిర్మిస్తున్న కొత్త చిత్రం ఇడుపు కాయితం. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా టైటిల్ అర్థం కావడం లేదని కామెంట్ చేస్తున్నారు. అయినా సరే టైటిల్ మార్చే ప్రసక్తే లేదని నిర్మాత బన్నివాసు క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఈ విషయంపై స్పందించారు. ఇడుపు కాయితం అంటే అర్థం కావడం లేదంటూ కొంతమంది విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు . ఆ పేరుకు అర్థం కావలసిన వాళ్లు… పోయి సినిమా యాక్టర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను అడగాలని, దాని అర్థం పవన్ కచ్చితంగా చెప్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన భాష మీద, యాస మీద అవహేళన చేసినందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఇకనైనా ఇలాంటి వెకిలి ప్రయత్నాలు మానుకోవాలని, ఒకరి భాషను, ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకోవాలని హితవు పలికారు.
►ALSO READ | వివాహ బంధానికి గుడ్‌బై: ‘గత ఏడాదిగా విడిగా ఉంటున్నాం’.. అని షాక్ ఇచ్చిన టీవీ బ్యూటీ
అంతేకాదు… తెలంగాణ భాషను కించపరుస్తున్నా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టే కాంగ్రెస్ మౌనంగా ఉందన్నారు. ఇటు బీజేపీ, అటు మిగతా పార్టీలు కూడా దీనిపై నోరు మెదపకపోవడాన్ని ఆమె తప్పుపట్టారు. తెలంగాణను అవమానపరిచినా, మా భాషను కించపరిచినా ఊరుకునే ప్రసక్తే లేదని, టీఆర్ఎస్ ఎప్పటికీ తెలంగాణ అస్తిత్వం కోసమే పోరాడుతుందని కవిత స్పష్టం చేశారు.