Reading Time: 2 minutes
జస్ట్‌ 15 మినెట్స్.. టేస్ట్‌కు టేస్ట్.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. చద్దన్నంతో ఇలా పొంగణాలు చేసి తింటే..

చాలా మంది ఇళ్లలో కొన్ని సార్లు రాత్రి అన్నం మిగిలిపోతుంది.. ఉదయం లేవగానే దానిని పడేస్తూ ఉంటారు. కానీ దాన్ని సరిగ్గా స్టోర్ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కు ఆ రైస్‌తోనే ఆరోగ్యకరమైన, టేస్టీగా ఉండే గుంతపొంగనాలు చేసుకోవచ్చు. అవును సాధారణంగా వీటిని రవ్వ లేదా బియ్యం పిండితో చేస్తారు. కానీ రాత్రి మిగిలిన అన్నంతో చేస్తే ఇవి మరింత టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి. ఇందులో మీకు నచ్చిన కూరగాయలు కలిపి పిల్లల లంచ్ బాక్స్‌లోకి లేదా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా చేసి పెట్టవచ్చు. కాబట్టి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం.

రాత్రి అన్నంతో గుంతపొంగనాలు చేయడం ఎలా?

మొదట మీరు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసి, కొద్దిగా పెరుగు లేదా నీళ్లు పోసి మెత్తగా ఉండేలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా బొంబాయి రవ్వ, కాస్త పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత దాన్ని పక్కన పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు అలానే ఉంచాలి. దీనివల్ల రవ్వ బాగా నానుతుంది.. అప్పుడు గుంతపొంగనాలు పచ్చిగా అనిపించవు.

మీరు వాటిని పెనంపై కాల్చడానికి ముందు పిండిలో మీకు నచ్చిన క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వంటి కూరగాయలు యాడ్ చేసుకొని, దానితో పాటు ఒక చిన్న పాన్‌లో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి పోపు పెట్టి ఆ మిశ్రమాన్ని పిండిలో కలపండి. ఇది మీరు వేసే గుంతపొంగనాలకు మరింత రుచిని ఇస్తుంది.

ఇప్పుడు స్టౌ ఆన్ చేసి దానిపై గుంత పొంగనాల పెనం పెట్టి వేడి చేయండి.. అది వేడి అయ్యేలోపు మీరు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో కాస్త ఈనో లేదా బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. ఇప్పుడు పొంగనాల పెనంలోని గుంతల్లో లైట్‌గా ఆయిల్ వేసి.. మీరు కలిపి పెట్టుకున్న పిండిని అందులో వేయండి.

ఇవి చేసేటప్పుడు మంటను ఎప్పుడూ.. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోండి. ఇలా అవి గోధుమ వర్ణంలోకి వచ్చిన తర్వాత రెండు వైపులా తిప్పుకొని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. అంతే క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే గుంత పొంగణాలు రెడీ అయినట్టే.. వీటిని చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుందంతే! అయితే ఈనో కలిపిన పిండిని మీరు ఎక్కువ సేపు ఉంచవద్దు.. వెంటనే పొంగణాలు వేసుకోవాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.