
- జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా అహ్మద్ నదీమ్
- ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా విద్యాసాగర్
- బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్సెక్రటరీగా రాహుల్ బొజ్జా
హైదరాబాద్, వెలుగు: సింగరేణి మాజీ సీఎండీ, ప్రస్తుతం పరిశ్రమల శాఖలో మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎన్. శ్రీధర్..సీఎం రేవంత్‌రెడ్డికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక సీఎం స్పెషల్ సెక్ర టరీగా ఉన్న అజిత్‌రెడ్డిని ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది.
రాష్ట్రంలో పరిపాలనా అవసరాలకు తగ్గట్టుగా ప్రభు త్వం కేడర్, నాన్ కేడర్ ఐఏఎస్ అధికారులను పెద్దసంఖ్యలో బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్లాగ్‌షిప్ సంక్షేమ పథకాల విభాగం స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్ కు చేనేత, జౌళి శాఖ, టీజీ కో, హ్యాండీ క్రాఫ్ట్స్ సంస్థల ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
చాలా ఏండ్లపాటు ఈ శాఖల బాధ్యతలు చూస్తున్న శైలజా రామయ్యర్‌ను తప్పించారు. సబ్యసాచి ఘోష్ ప్రస్తుతం చూస్తున్న గిరిజన, ఇతర సంక్షేమ శాఖల స్పెషల్ సీఎస్ అదనపు బాధ్యతల్లోనే కొనసాగుతారు. అలాగే, టీజీఆర్పీడీసీఎల్ సీఎండీగా ఉన్న మహ్మద్ ముషారఫ్ అలీ ఫారూఖీకి టీజీ రెడ్కో వీసీ అండ్ ఎండీగా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు.
రఘునందన్ రావుకు మైన్స్ అండ్ జియాలజీ
పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అహ్మద్ నదీమ్‌ను సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేస్తూ, గతంలో ఆ పోస్టు అదనపు బాధ్యతల్లో ఉన్న ఎం. రఘునందన్ రావును సదరు బాధ్యతల నుంచి తప్పించారు. అలాగే, అహ్మద్ నదీమ్‌కు మైనారిటీ సంక్షేమ శాఖ పూర్తి అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు.
సెలవుల నుంచి తిరిగి వచ్చిన రాహుల్ బొజ్జాకు రెవెన్యూ శాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు కట్టబెడుతూ, గతంలో ఆ పోస్టు అదనపు బాధ్యతల్లో ఉన్న హరిచందన దాసరిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. రాహుల్ బొజ్జా ప్రస్తుతం చూస్తున్న బీసీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతల్లోనే కొనసాగుతారు. ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ను పర్యావరణ, అటవీ శాఖకు బదిలీ చేస్తూ, తిరిగి పాత ఎండోమెంట్స్, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ అదనపు బాధ్యతల్లో ఉంచారు.
ఇందులో ఈపీటీఆర్ఐ డీజీ బాధ్యతల నుంచి అహ్మద్ నదీమ్‌ను తప్పించారు. మరికొన్ని కీలక శాఖల్లో కూడా అదనపు బాధ్యతల సర్దుబాటు జరిగింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ కార్యదర్శి ఎం. రఘునందన్ రావుకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా చంద్రకళ
జిల్లాల పరిధిలోని కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్‌మెంట్ విభాగాల్లోనూ పలు మార్పులు జరిగాయి. పీ. కాత్యాయనీ దేవిని చేనేత, జౌళి శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేస్తూ , తిరిగి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతల్లో ఉంచారు. టీజీ రెరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే గంగాధర్ ను రోడ్లు-భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించారు.
గతంలో ఆ పోస్టులో ఉన్న పీ. ప్రావీణ్యను బదిలీ చేశారు. హెచ్ఎం డీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా పనిచేస్తున్న టి. వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌గా బదిలీ చేశారు. సీఎంవో ఓఎస్డీగా ఉన్న కే. విద్యాసాగర్‌ను టూరిజం డైరెక్టర్‌గా నియమిస్తూనే, డీ. దివ్యను తప్పించి ‘ప్రజావాణి’ స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా ఎఫ్‌ఏసీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కే. చంద్రకళకు హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.