
జంజ్‌గిర్, జూన్ 26: ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గీర్-చంపా జిల్లా కోస్మాండా గ్రామానికి చెందిన ముస్కాన్ ప్రధాన్ (22)కు ఖోఖ్రా గ్రామానికి చెందిన సంత్ రామ్ (24)తో జూన్ 23న వివాహం నిశ్చయమైంది. నిర్ణీత సమయానికి పెళ్లి బృందం వధువు ఇంటికి చేరుకుంది. వివాహ కార్యక్రమాలు ప్రారంభమైన కొద్దిసేపటికే పెళ్లికొడుకు ఫూటుగా మద్యం సేవించి మత్తులో పెళ్లి మండపానికి చేరుకున్నాడు. కనీసం సరిగా నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు. దీంతో మండపంలోని వధువు ముస్కాన్ వరుడి చెంప చెళ్లుమనిపించింది. తాగుబోతును వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో పెళ్లి రద్దు అయింది. నిశ్చితార్థం సమయంలో కూడా పెళ్లికొడుకు మద్యం సేవించి వచ్చినట్లు ముస్కాన్ పోలీసులకు తెలిపింది. అప్పుడే అతడిని హెచ్చరించగా, ఇకపై మద్యం తాగనని హామీ ఇచ్చాడని పేర్కొంది. అయితే పెళ్లి రోజే మళ్లీ మద్యం మత్తులో రావడంతో తన నిర్ణయాన్ని మార్చుకోలేదని చెప్పింది.
వధువు నిర్ణయంతో పెళ్లి వేదిక వద్ద ఇరు కుటుంబాల సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో రెండు వర్గాల యువకుల మధ్య ఘర్షణ జరగగా కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పెళ్లి ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని వధువు కుటుంబానికి సుమారు రూ.3 లక్షల పరిహారం చెల్లించేందుకు వరుడి కుటుంబం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పదో తరగతి వరకు చదివిన ముస్కాన్ ప్రస్తుతం తన చదువును కొనసాగించాలని భావిస్తుంది. మద్యం వ్యసనానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడినందుకు జంజ్‌గీర్-చంపా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆమెను సామాజిక కార్యకర్తలు, మహిళా ప్రతినిధుల సమక్షంలో సత్కరించారు.
ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. మద్యం వ్యసనం, బాధ్యతారాహిత్యాన్ని పెళ్లిళ్లలో నిర్లక్ష్యం చేయకూడదనే సందేశాన్ని ఈ ఘటన సమాజానికి ఇచ్చిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముస్కాన్ తీసుకున్న నిర్ణయం అనేక కుటుంబాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.