
CM Chandrababu : ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన ‘సంజీవని’, ‘అన్నదాతకు సాగునీటి పంపిణీ’ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలనేది ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అని, ఆ హామీని నెరవేర్చి తమ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే పార్లమెంటు నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా మార్చామని ఆయన వెల్లడించారు. తాము ప్రవేశపెట్టిన ‘సంజీవని’ పథకంతో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, అలాగే సాగునీటి పంపిణీ ద్వారా అన్నదాతల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
స్వార్థం కోసం కాదు.. రాష్ట్రం కోసమే కూటమి ఏర్పాటు
తాను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ కలిసి ఎన్డీఏ (NDA) కూటమిని ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ కూటమి ఎలాంటి స్వార్థంతో ఏర్పడలేదని, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే తామంతా చేతులు కలిపామని స్పష్టం చేశారు. తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, గతంలో ఎన్నో ఇబ్బందులను, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించానని చెప్పారు. అయితే, ఈ నాలుగో విడత పాలనలో లోతుగా వెళ్లేకొద్దీ గత ప్రభుత్వం చేసిన అగాధాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంపై దాదాపు రూ. 10 లక్షల కోట్ల అప్పు భారం ఉందని, గత ఐదేళ్లలో అధికార యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైందని మండిపడ్డారు.
గత ఐదేళ్లలో దారుణమైన పరిస్థితులు.. నేరగాళ్లకు హెచ్చరిక
రాష్ట్రంలో ఎక్కడ చూసినా శాంతిభద్రతల (లా అండ్ ఆర్డర్) సమస్య వేధిస్తోందని, 2019-24 మధ్య కాలంలో పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఒకపక్క గంజాయి బ్యాచ్‌లు, మరోపక్క బ్లేడు బ్యాచ్‌లు తిరుగుతున్నాయని, వీటన్నింటికీ ఒక ‘గొడ్డలి పార్టీ’ నాయకత్వం వహిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏమీ జరగకపోయినా తెలివిగా నేరాలు చేయడంలో వీళ్లు దిట్టలని, రాబందుల మాదిరిగా సమయం కోసం వేచి చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని ఈ సందర్భంగా సీఎం కఠినంగా హెచ్చరించారు. తాము అనుకున్న లక్ష్యం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వ సత్తా.. సంజీవని డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై స్పందిస్తూ.. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తున్న ఘనత ఎన్డీఏ కూటమికే దక్కిందన్నారు. వచ్చే నెలలోనే ఈ పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి రూ. 15,000 చొప్పున జమ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరపతి పెరిగిందని, ప్రైవేట్ స్కూళ్ల నుండి దాదాపు లక్ష మంది పిల్లలు ప్రభుత్వ బడుల్లో చేరడమే ఎన్డీఏ ప్రభుత్వ సత్తాకు నిదర్శనమన్నారు. వీటితో పాటు ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఏడాదికి మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, అన్నదాతలకు ఏటా రూ. 20,000 సాయం అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించడం కోసం ‘సంజీవని’ అనే వినూత్న, సమగ్ర డిజిటల్ ఆరోగ్య వేదికను తీసుకువచ్చామని, ఇది ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.