
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పనులు ఊపందుకున్నాయి. తొలి దశ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసి, 2028 నాటికి వైద్య సేవలు ప్రారంభించాలనే లక్ష్యంతో ట్రస్ట్ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు 2019లో శంకుస్థాపన జరిగినా వివిధ కారణాలతో నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు మళ్లీ వేగం అందుకుంది. హైదరాబాద్‌లో మూడు దశాబ్దాలుగా క్యాన్సర్ రోగులకు సేవలందిస్తున్న బసవతారకం సంస్థ.. ఇప్పుడు అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యాధునిక చికిత్స అందించేందుకు సిద్ధమవుతోంది.
క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సిన పరిస్థితి.. భవిష్యత్తులో చాలా వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. అమరావతి తుళ్లూరు సమీపంలో 21 ఎకరాల్లో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతోంది. తొలి దశకు రూ.750 కోట్ల వ్యయంతో 500 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. ఇందులో అత్యాధునిక అంకాలజీ, రేడియేషన్, సర్జికల్, మెడికల్ క్యాన్సర్ చికిత్స సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దశ పూర్తయిన వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలని ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్టు కొత్తది కాదు. 2019లో అప్పటి ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన జరిగినప్పటికీ.. తర్వాత అమరావతి అభివృద్ధి నిలిచిపోవడంతో ఆసుపత్రి నిర్మాణం కూడా ముందుకు సాగలేదు. ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టుకు మళ్లీ ఊపిరి వచ్చింది. అదనంగా భూమి కేటాయించడంతో మొత్తం 21 ఎకరాల్లో నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇటీవల పనులకు శ్రీకారం చుట్టిన ట్రస్ట్.. తొలి దశ నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రకటించింది.
బసవతారకం ఆసుపత్రి అంటే కేవలం మరో క్యాన్సర్ హాస్పిటల్ కాదు. ఎన్టీఆర్ తన సతీమణి బసవతారకం స్మారకార్థం స్థాపించిన ఈ సంస్థ.. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సను తక్కువ ఖర్చుతో అందిస్తూ దేశంలోనే ప్రముఖ క్యాన్సర్ కేంద్రంగా ఎదిగింది. ప్రస్తుతం 500కు పైగా పడకలు, ఆధునిక చికిత్సా సదుపాయాలతో వేలాది మంది రోగులకు సేవలందిస్తోంది. అదే సేవా తత్వాన్ని అమరావతికి విస్తరించడమే ఈ కొత్త క్యాంపస్ లక్ష్యం.
తొలి దశలో 500 పడకలతో సేవలు ప్రారంభించి.. రెండో దశలో మరో 500 పడకలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో మొత్తం సామర్థ్యం వెయ్యి పడకలకు చేరుతుంది. పరిశోధన విభాగాలు, ప్రత్యేక సర్జరీ విభాగాలు, ఆధునిక నిర్ధారణ కేంద్రాలు, రీజినల్ రిఫరల్ సెంటర్‌గా అభివృద్ధి చేసే ప్రణాళిక ఉంది. బాలకృష్ణ ప్రకటించిన ప్రకారం.. 2028 నాటికి తొలి దశ పూర్తిచేసి రోగులకు వైద్య సేవలు ప్రారంభించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. అమరావతి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల ప్రజలకు కూడా ఈ ఆసుపత్రి కీలక వైద్య కేంద్రంగా మారనుంది.
హైదరాబాద్‌లో విశ్వసనీయ క్యాన్సర్ చికిత్సకు చిరునామాగా నిలిచిన బసవతారకం ఆస్పత్రి.. ఇప్పుడు అమరావతిలోనూ అదే స్థాయి వైద్య సేవలను అందించేందుకు అడుగులు వేస్తోంది. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తైతే.. 2028 నుంచి క్యాన్సర్ రోగులకు రాజధానిలోనే అత్యాధునిక చికిత్స అందుబాటులోకి రానుంది.
పనులు పరిశీలిస్తున్న బాలకృష్ణ వీడియో..