
- గమ్య స్థానానికి తొందరగా వెళ్లే ఆరాటంతో నిర్లక్ష్యపు డ్రైవింగ్..
- స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయి విచక్షణ కోల్పోతున్నారంటున్న సైకాలజిస్టులు
- హారన్ కొట్టాడనో, వెహికల్ కట్ చేశాడనో
- రోజూ వందలాది ఘర్షణలు
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ మహానగరంలో వాహనదారుల్లో అసహనం పెరిగిపోతోంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని అసహనానికి గురవుతున్న వాహనదారులు పక్క నుంచి ఏదైనా వాహనం చిన్నగా తాకుతూ వెళ్లినా కోపాన్ని నియంత్రించుకోలేకపోతున్నారు. తమ వెనక వస్తున్న వాహనాలు చిన్నగా హారన్కొట్టినా తట్టుకోలేకపోతున్నారు. పక్క నుంచి వెహికల్కట్చేసుకుంటూ వెళ్లినా వెంటపడి మరీ గొడవ పెట్టుకుంటున్నారు.
ఇలా సిటీలో కొంతకాలంగా నడిరోడ్డుపై ‘రోడ్ రేజ్’ (వాహనదారుల మధ్య ఘర్షణలు) పెరుగుతున్నాయి. నడిరోడ్డుపై కాలర్లు పట్టుకోవడం, బూతులు తిట్టుకోవడం, విచక్షణారహితంగా కొట్టుకోవడం హైదరాబాద్‌లో సర్వ సాధారణమైపోయింది. ఇలాంటి ఘటనలు మారుతున్న వాహనదారుల మానసిక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
- రోజూ 15 కాల్స్.. రెండు మూడు కేసులు
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ల పరిధిలో రోజూ ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తీవ్రమైన దాడులు చేసుకునే వరకు వెళ్లి కేసులు కూడా పెట్టుకుంటున్నారు. ఫలానా చోట ట్రాఫిక్‌లో ఇద్దరు వాహనదారులు కొట్టుకుంటున్నారని డయల్ 100కి రోజుకు సగటున 10 నుంచి15 ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
ఇలాంటి 80 శాతం గొడవలను పోలీసులు అక్కడికక్కడే నచ్చజెప్పి, లేదా పీఎస్‌కు తీసుకువెళ్లి రాజీ పడేలా చేసి పంపిస్తున్నారు. కానీ, ఆర్టీసీ డ్రైవర్లు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ పై దాడులు జరిగే సందర్భాల్లో మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు.
- ఒత్తిడి, ఊహించని అడ్డంకులు..
గమ్యస్థానాన్ని సకాలంలో చేరుకోవాలనే ఒత్తిడి, రోడ్డుపై ఎదురయ్యే ఊహించని అడ్డంకులు వాహనదారులను కోపానికి గురయ్యేలా చేస్తున్నాయి. ఉదయం ఆఫీసులకు వెళ్లేటప్పుడు, సాయంత్రం అలసిపోయి ఇండ్లకు తిరిగొచ్చేటప్పుడు కిలోమీటర్ల మేర ఉండే ట్రాఫిక్ జామ్‌లు సహనాన్ని పూర్తిగా పరీక్షిస్తున్నాయి.
దీనికి తోడు రాంగ్ రూట్ డ్రైవింగ్, అనాలోచితంగా సిగ్నల్ జంప్ చేయడం వంటి తోటి డ్రైవర్ల బాధ్యతారాహిత్యం, ప్రశాంతంగా ఉన్న వ్యక్తిని కూడా రెచ్చగొట్టేలా చేస్తున్నాయి. ఈ నిరంతర ట్రాఫిక్ నరకం మనుషుల సహన పరిమితికి మించిపోయి ఒక చిన్న నెపం దొరకగానే కోపమంతా ఎదుటి వ్యక్తిపై ప్రదర్శించేలా చూస్తున్నాయి.
- విచక్షణ జ్ఞానం కోల్పోయి..
ట్రాఫిక్‌లో గంటల తరబడి చిక్కుకుపోవడం వల్ల మెదడులో ‘కార్టిసోల్’, ‘అడ్రినలిన్’ వంటి స్ట్రెస్ హార్మోన్లు విపరీతంగా విడుదలవుతాయని, ఇవి ఎప్పుడూ ‘ఫైట్ లేదా ఫ్లైట్’(పోరాడు లేదా పారిపో) అనే ఉద్వేగ స్థితిలో ఉంచుతాయని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఈ స్థితిలో ఉన్నప్పుడు మెదడులోని విచక్షణ జ్ఞానం పనిచేయడం తగ్గిపోతుందంటున్నారు.
ఫలితంగా, పక్క వాహనదారుడు చేసిన చిన్న పొరపాటు కూడా పెద్ద నేరంలా కనిపిస్తుందని, తమ సొంత జీవితాల్లో ఉండే వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిడులను కూడా డ్రైవర్లు రోడ్డుపై చూపిస్తారని అంటున్నారు. అందుకే అత్యంత చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలకు దిగుతుంటారని అంటున్నారు.
- నా బండికే అడ్డం వస్తావా..
హైదరాబాద్ యువతలో పెరుగుతున్న ఈగో(అహంకారం) సోషల్ స్టేటస్ భావనలు కూడా గొడవలకు ఆజ్యం పోస్తున్నాయి. ‘నా బండికే అడ్డం వస్తావా?’, ‘నా లగ్జరీ కార్‌నే ఓవర్‌టేక్ చేస్తావా? అనే ఈగోలు నడిరోడ్డుపై ఘర్షణలకు దారితీస్తున్నాయి. ప్రస్తుత లైఫ్స్టైల్లో డిజిటల్ స్క్రీన్ల వాడకం పెరగడం వల్ల యువతలో సహజంగానే ఓపిక తగ్గిపోయింది. ఏ విషయాన్నైనా తట్టుకోలేని సున్నిత మనస్తత్వం, తక్షణమే స్పందించాలనే ప్రవర్తనగా మారి రోడ్డుపై హింసకు ప్రేరేపిస్తోంది.
- హారన్ కొట్టాడని జిమ్ ట్రైనర్‌పై దాడి
జూబ్లీహిల్స్ లో కొద్ది రోజుల కింద తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓ బైకర్(జిమ్ ట్రైనర్) సిగ్నల్ క్లియర్ కాకపోయినా కారు డ్రైవర్‌ను ముందుకు వెళ్లాలని వరుసగా హారన్ కొడుతూనే ఉన్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన కారు ఓనర్వచ్చి బైకర్‌తో ఘర్షణకు దిగాడు. మాట మాట పెరగడంతో కోపంతో బైకర్ హెల్మెట్‌ను లాక్కొని దాంతోనే అతని తల పగలగొట్టాడు.
- వెనుక నుంచి కారు తాకిందని..
మాదాపూర్ ఐటీ కారిడార్ లో వర్షం పడుతున్న టైంలో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఓ కారు డ్రైవర్బ్రేక్ వేయగా, వెనుక వస్తున్న డెలివరీ బాయ్ బైక్ కంట్రోల్తప్పి కారు బంపర్‌ను స్వల్పంగా ఢీకొట్టాడు. కారుకు ఎలాంటి స్క్రాచ్ పడకపోయినా, కారులోని ఇద్దరు యువకులు కారు దిగి డెలివరీ బాయ్‌ను కాలర్ పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. నడిరోడ్డుపై పిడిగుద్దుల వర్షం కురిపించారు.
- ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి..
కొద్ది రోజుల కింద ఎల్బీనగర్ వైపు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు పక్కనే వెళ్తున్న స్కూటీ సైడ్ మిర్రర్‌ను తాకుతూ వెళ్లింది. దీంతో కోపానికి గురైన వాహనదారుడు తన స్నేహితుడిని పిలిపించి, బస్సును ముందున్న సిగ్నల్ వద్ద అడ్డగించాడు. డ్రైవర్ క్యాబిన్‌లోకి దూరి దాడికి దిగాడు.
- 15 నిమిషాల ముందు బయల్దేరితే..
భయంకరమైన రోడ్ రేజ్ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటే వాహనదారుల ఆలోచనా విధానంలో మార్పు రావడం చాలా అవసరమని నిపుణులు చెప్తున్నారు. ట్రాఫిక్ ఒత్తిడిని అధిగమించడానికి ప్రయాణ సమయం కంటే 15 నిమిషాల ముందే ఇండ్ల నుంచి బయలుదేరడం మంచిదని అంటున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండటం, కోపం వస్తున్నప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకోవడం వంటి చిన్న చిన్న చిట్కాలు మెదడును ప్రశాంతపరుస్తాయంటున్నారు.
రోడ్డుపై ఎవరైనా తప్పుగా డ్రైవ్ చేస్తే, దాన్ని వ్యక్తిగత అవమానంగా తీసుకోకుండా, అవతలి వ్యక్తి అజ్ఞానంగా భావించి వదిలేయడం వల్ల మన మానసిక ప్రశాంతతను కాపాడుకోవచ్చంటున్నారు. కేవలం కౌన్సెలింగ్ మాత్రమే కాకుండా, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి ఘటనలు తగ్గుతాయంటున్నారు. నడిరోడ్డుపై ప్రయాణికులను భయపెట్టేలా ప్రవర్తించేవారిని శిక్షించాలంటున్నారు. ఒకరి కోపం, కొన్ని నిమిషాల అసహనం వల్ల వందలాది వాహనాలు ట్రాఫిక్ ల్లో చిక్కుకుపోతున్నాయని అంటున్నారు.