Reading Time: 3 minutes

నాలాల నిండాప్లాస్టిక్ గుట్టలు.. చెత్తను డ్రైనేజీల్లో వేస్తున్న పబ్లిక్

Caption of Image.
  • వాన పడితే మునుగుతున్న కాలనీలు
  • దోమలు,ఈగలు పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం
  • ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నా మోరీల వైపు చూడని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు
  • సోషల్ ​మీడియాలో కరీంనగర్​ డ్రైనేజీ వీడియోల వైరల్

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ఏ నాలా చూసినా, ఏ డ్రైనేజీని గమనించినా ప్లాస్టిక్​ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ప్రజలు పాలథీన్​కవర్లు,  బాటిళ్లు, టీ గ్లాసులు, ఇతర ప్లాస్టిక్​ వ్యర్థాలను నేరుగా డ్రైనేజీల్లోకి విసిరేస్తుండడం, నెలల తరబడి వాటిని తొలగించేవారు లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి పారుతోంది. దోమలు, ఈగలు పెరిగి సీజనల్​ వ్యాధులు ప్రబలుతున్నాయి.

వర్షాలు జోరందుకుంటే వాన నీళ్లు రోడ్లను, కాలనీలను ముంచెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కరీంనగర్​లో ఓ 50 మీటర్ల దూరం డ్రైనేజీని క్లీన్​ చేస్తే రెండు ట్రాక్టర్లకు సరిపడా  ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడగా ఆ ఫొటోలు, వీడియోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పబ్లిక్​ హెల్త్​ శానిటేషన్​ పేరిట ప్రభుత్వం  యేటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నా మున్సిపల్​ సిబ్బంది మోరీలు తీయకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

ఏటా రూ.1,200 కోట్లు పెడ్తున్నా.. 
రాష్ట్రంలో 122 మున్సిపాలిటీలు, 12 గ్రేటర్​ కార్పొరేషన్లు ఉన్నాయి.వీటిలో పబ్లిక్​ హెల్త్​ శానిటేషన్​ విభాగంలో 30 వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో మురికి నీటి కాల్వలు, నాలాలు శుభ్రం చేయడానికి వార్డుల వారీగా శానిటేషన్​ సిబ్బందిని నియమించారు. వీరిలో శానిటరీ ఇన్‌‌స్పెక్టర్లు, హెల్త్ ఆఫీసర్లు, జవాన్లతో పాటు పర్మినెంట్, కాంట్రాక్ట్, అవుట్‌‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్లు ఉన్నారు. పారిశుధ్య నిర్వహణ కోసం ట్రాక్టర్లు, ఆటోలతో పాటు భూగర్భ డ్రైనేజీల్లో పూడికతీత కోసం  వ్యాక్యూమ్ సక్షన్ వెహికిల్స్​, రోడ్​ స్వీపింగ్​ మిషన్లు వంటి ఆధునిక యంత్రాలను సైతం కొనుగోలు చేశారు. ఈ పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజు తడి, పొడి చెత్తను సేకరించడంతో పాటుగా విధిగా మురుగుకాల్వలను శుభ్రం చేయాలి.

ఇందుకోసం గ్రేటర్​ హైదరాబాద్​ లాంటి మెగా సిటీలో ఏటా రూ.400 కోట్లకు పైగా ఖర్చవుతుండగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం వంటి మేజర్ కార్పొరేషన్లలో ఏటా రూ.15 కోట్ల నుంచి రూ25 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మేడ్చల్​ జిల్లాలోని కొంపల్లి వంటి అతి చిన్న మున్సిపాలిటీ సైతం శానిటేషన్ నిర్వహణలో భాగంగా సిబ్బంది వేతనాలు, వెహికిల్స్​ మేయింటనెన్స్​ పేరిట రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాలు కేటాయించే నిధుల్లో సింహభాగం పారిశుద్ధ్య నిర్వహణకే ఉపయోగిస్తున్నారు. ఇవి సరిపోకపోతే మున్సిపాలిటీలు వసూలు చేసే ఆస్తి పన్ను, నాలా పన్నుల ద్వారా వచ్చే సొంత ఆదాయం నుంచి కూడా జీతాలు చెల్లిస్తున్నారు.

25 వేల కిలోమీటర్లకు పైగా డ్రైనేజీ వ్యవస్థ
రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి 25 వేల కిలోమీటర్లకు పైగా డ్రైనేజీ వ్యవస్థ ఉన్నది. ఇందులో వరదల నుంచి రక్షించే ప్రధాన నాలాలు, అంతర్గత మురికినీటి కాలువలు, భూగర్భ డ్రైనేజీలు ఉన్నాయి.  సిమెంట్‌‌తో శాశ్వతంగా నిర్మించిన అంతర్గత కాలువలే 65 శాతానికి పైగా ఉన్నాయి.

గ్రేటర్​ హైదరాబాద్​, వరంగల్​, కరీంనగర్​, ఖమ్మం వంటి కొన్ని ప్రధాన పట్టణ కేంద్రాలలో 20 శాతానికి పైగా భూగర్భ పైప్‌‌లైన్లు ఉన్నాయి. మిగతావన్నీ కూడా తాత్కాలికంగా నీరు ప్రవహించే కాలువలే. హైదరాబాద్‌‌ను వరదల నుంచి రక్షించే ప్రధాన నాలాల పొడవు సుమారు 400 కిలోమీటర్లు ఉండగా భూగర్భ డ్రైనేజీ నెట్‌‌వర్క్ పొడవు 7 వేల  కిలోమీటర్లకు పైగా ఉంది.  వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి కార్పొరేషన్ల పరిధిలో సగటున 300 నుంచి 550 కిలోమీటర్ల పొడవైన అంతర్గత మురికి కాలువలు ఉన్నాయి.  చిన్న మున్సిపాలిటీల్లో అయితే పట్టణ పరిధిని బట్టి 80 నుంచి 150 కిలోమీటర్ల పొడువునా ఓపెన్​ డ్రైనేజీలు ఉన్నాయి.

డ్రైన్లు నిండి రోడ్ల పైకి మురుగు నీరు
నగరాలు, పట్టణాల్లో ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ డ్రైనేజీలు శుభ్రం చేసేవాళ్లు లేక తరుచూ బ్లాక్​అయ్యి, రోడ్లపైకి మురుగునీరు వస్తున్నది. చిన్నపాటి వాన పడితే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. కాలనీలు నీట మునుగుతున్నాయి.  మున్సిపల్​ యాక్ట్​ 2019 ప్రకారం శానిటేషన్​ సిబ్బంది ప్రతి రెండు రోజులకోసారి తమ వార్డు పరిధిలో ఉన్న అన్ని కాలనీల్లోని నాలాలు, డ్రైనేజీలను క్లీన్​ చేయాలి. ఒకవేళ మోరీలు పూడుకుపోయినట్లు ఫిర్యాదు వస్తే మున్సిపల్ సిటిజన్ చార్టర్ ప్రకారం 48 గంటల లోపు ఆ సమస్యను పరిష్కరించాలి. కానీ శానిటేషన్​ సిబ్బంది  కేవలం రోడ్లు ఊడవడం, చెత్త సేకరణకే పరిమితం అవుతున్నారు.

వాస్తవానికి శానిటేషన్​ సిబ్బందికి ప్రభుత్వం  గ్లౌజులు, మాస్కులు, గమ్ బూట్లు, రేన్‌‌కోట్లు, రేడియం జాకెట్లతో పాటు చీపుర్లు, పారలు, గంపలు, తట్టలు, ఇనుప రాడ్లు, చెత్తను నెట్టే చేతి బండ్లు ఉచితంగా సరఫరా చేస్తోంది. వీటితో పాటు ప్రతి మున్సిపాలిటీలకు ట్రాక్టర్లు, 6 నుంచి 9 టన్నుల సామర్థ్యం ఉన్న టిప్పర్లు ఉన్నాయి. భూగర్భ డ్రైనేజీల కోసం వ్యాక్యూమ్ సక్షన్ వాహనాలు, పవర్ రాడ్లు, జెట్టింగ్ మిషన్లను వాడుతున్నారు.

పెద్ద వాహనాలు వెళ్లలేని ఇరుకైన వీధుల కోసం మున్సిపల్ కార్పొరేషన్లు రిక్షాలు, తోపుడు బండ్లను అందించాయి.  స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు, పెద్ద, పెద్ద నాలాలను క్లీన్​ చేయడానికి జేసీబీలను సైతం కొనిచ్చింది. డ్రైవర్లకు జీతాలు, డీజిల్  బిల్లులు, మరమ్మతుల పేరిట  వందల కోట్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ  అధికారుల ప్లానింగ్​లోపం వల్ల  శానిటేషన్​సమస్యలు వస్తున్నాయనే విమర్శలున్నాయి. 

పెరుగుతున్న ఈగలు, దోమలు..
ఇప్పటికే వానాకాలం మొదలైంది. ఈ టైంలోనైనా డ్రైనేజీలను క్లీన్​ చేయకపోతే దోమలు, ఈగలు పెరిగి సీజనల్​ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్​వ్యర్థాలను తొలగించకపోవడం ఒక సమస్య అయితే.. చాలా సిటీలు, టౌన్లలో  నాలాలు, డ్రైనేజీలను మూసివేసి చేపట్టిన నిర్మాణాలను తొలగించకపోవడం మరో సమస్య. దీని వల్ల చిన్న వర్షానికే వరద కాలనీలను ముంచెత్తతోంది.

ఆయా నాలాలు, డ్రైనేజీలపై ఆక్రమణలను తొలగించేందుకు వెళ్తే రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని  పలువురు శానిటేషన్​ ఇన్​స్పెక్టర్లు చెబుతున్నారు. అడ్డుగా పెట్టిన రాళ్లను తీసేందుకు వెళ్తే  మున్సిపల్​ కౌన్సిలర్లు, కార్పోరేటర్లు అడ్డుకొని వెళ్లగొడుతున్నారని వాపోతున్నారు.  నగరాల, పట్టణాల్లో కనీసం 30 శాతానికి పైగా ఇలాంటి డ్రైన్లను నెలల తరబడి క్లీన్ చేయకపోవడం వల్ల ప్రజలు తీని పారేసే ప్లాస్టిక్​ వస్తువులు కొట్టుకొచ్చి డ్రైన్లు నిండిపోతున్నాయని వివరిస్తున్నారు.

కరీంనగర్లో..
కరీంనగర్​ కార్పొరేషన్ ​జ్యోతినగర్​ పరిధిలోని  ఓ వీధిలో శానిటేషన్​ సిబ్బంది డ్రైనేజీ​ క్లీన్​ చేస్తుండగా బయటికి వచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలివి​. కేవలం 50 మీటర్ల పరిధిలో ఇలా గుట్టలు, గుట్టలుగా బయటపడ్డాయి. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో కార్పొరేషన్​ అధికారుల నిర్లక్ష్యంతో పాటు ప్లాస్టిక్​ వస్తువులను నాలాలో పడేసిన నగర ప్రజల తప్పుకూడా ఉందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.