Reading Time: 2 minutes
Chanakya Niti Success Strategy Look Foolish Stay Smart Defeat Enemies

Chanakya Niti:”తెలివిగా ఉండు.. కానీ అవతలి వారికి మాత్రం అమాయకుడిలా కనిపించు”.. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ ఒక్క చిన్న లైన్‌లో జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడిపించే ఒక గొప్ప వ్యూహం దాగి ఉంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ సమాజంలో తామే అత్యంత తెలివైన వాళ్లమని నిరూపించుకోవాలని తాపత్రయపడుతుంటారు. కానీ, మన చుట్టూ ఉన్న అందరి ఆలోచన ఒకేలా ఉండదు. మీరు గనుక మీ తెలివితేటలను, ప్లాన్‌లను అందరి ముందూ ప్రదర్శిస్తే.. జనాలు మిమ్మల్ని తక్కువగా అంచనా వేయడమే కాకుండా, మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని వాడుకునే ప్రమాదం ఉంది. అందుకే నిజమైన బుద్ధిమంతులు తన చతురతను ఎప్పుడూ దాచి ఉంచుతారని, సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని అస్త్రంగా ప్రయోగిస్తారని చాణక్యుడు చెబుతున్నారు.

మూర్ఖుడిలా నటించడం ఎందుకు ముఖ్యం అంటే..

వాస్తవానికి ప్రతి చర్చలోనూ లేదా వాదనలోనూ నేనే తోపు అని నిరూపించుకోవాలని చూడటం గొప్పతనం అనిపించుకోదు. అలా చేస్తే జనాలు మీకు క్రమంగా దూరమవుతారు లేదా మిమ్మల్ని ఎలాగైనా కిందకు లాగాలని చూస్తారు. కొన్నిసార్లు అవతలి వ్యక్తి వేస్తున్న తప్పుడు అడుగులు లేదా కుతంత్రాలు మీకు తెలిసినప్పటికీ.. ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండిపోవడమే మీకు తెలివితేటలు ఉన్నాయని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తుంది. మీరు ఎప్పుడైతే మౌనంగా ఉంటారో, అవతలి వాడు తన అసలు రంగును తానే బయటపెట్టుకుంటాడు. ఎలాంటి గొడవలు లేకుండా జీవితంలో ముందుకు వెళ్లడానికి ఈ ‘సైలెంట్ స్ట్రాటజీ’ అద్భుతంగా పనిచేస్తుందని ఆచర్య చాణక్య చెబుతున్నారు.

స్వార్థపరుడిగా కాదు.. తెలివైనవాడిగా మారండి..

చాణక్య నీతి ప్రకారం.. ఎల్లప్పుడూ స్వార్థంగా జీవించమని అర్థం కాదు. పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు లేదా జనాలు మీ మంచితనాన్ని చేతకానితనంగా భావించి మిమ్మల్ని వాడుకుంటున్నప్పుడు.. మీ హక్కుల కోసం, మీ ఆత్మగౌరవం కోసం గొంతు ఎత్తడం చాలా ముఖ్యం. ఇక్కడ స్వార్థం అంటే ఎదుటివారిని నష్టపరచడం కాదు.. మనల్ని మనం కాపాడుకుంటూ సరైన నిర్ణయాలు తీసుకోవడం. జీవితంలో మనం అనుకున్న ప్రతిదీ జరగదు. ప్రతీ చిన్న విషయానికి రియాక్ట్ అయితే మానసిక ప్రశాంతతను కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అనవసరమైన విషయాలను లైట్ తీసుకోవడమే మీ సక్సెస్‌కు మొదటి మెట్టు. మీపై విమర్శలు చేసే ప్రతి ఒక్కరికీ మాటలతో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీ పని, మీ సక్సెస్‌తో మాత్రమే వారికి గట్టి సమాధానం ఇచ్చేలా చూసుకోండి.

మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి అందరికీ క్లారిటీ ఇస్తూ పోవడం మీ బలహీనతను అందరికీ తెలియజేస్తుంది. కొన్ని సమస్యలకు ‘మౌనమే’ పరమావధి అని చాణక్యుడు స్పష్టం చేశారు. మన వెనుక మాట్లాడేవాడు ఎప్పుడూ మన బలహీనతల కోసమే వెతుకుతుంటాడు. అలాంటి వారి మాటలను పట్టించుకోకుండా మీరు మెయింటైన్ చేసే మౌనమే వారికి అసలైన ఓటమి. ప్రతిదానికీ ‘సరే’ అనేవాళ్లు జీవితంలో ఎక్కువగా నష్టపోతారు, బాధపడతారు. మీకంటూ కొన్ని బౌండరీలను గీసుకోండి. అదే మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. చుట్టుపక్కల జరిగే చిన్నచిన్న గొడవల్లో ఇరుక్కుపోయి మీ పెద్ద గోల్స్ మర్చిపోకండి. ఏకాగ్రత తప్పనివాడే నిజమైన విజేతగా నిలుస్తాడనే సత్యాన్ని గుర్తుంచుకోండి. ఈ సమాజంలో నిటారుగా ఉండే చెట్లనే మొదటగా నరుకుతారు. అలాగే అతిగా అమాయకంగా ఉంటే లోకం తొక్కేస్తుంది. కాబట్టి సాదాసీదాగా ఉంటూనే.. లోపల ఎంతో కొంత చాకచక్యం, అప్రమత్తత కలిగి ఉండటం చాలా అవసరం అని ఆచర్య చాణక్య సూచిస్తున్నారు. ఈ విషయాలను మర్చిపోకుంటే మీరు జీవితంలో సక్సెస్ కావడమే కాకుండా.. మీ శత్రువులను కూడా చాలా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు.