
మనదేశంలో విభిన్నమైన భౌగోళిక స్వరూపం, పరిస్థితులు ఉన్నాయని మనందరికి తెలిసిందే..మంచు శిఖరాలనుంచి ఇసుక ఎడారుల వరకు అన్నీ ఉన్నాయి. విభిన్న భౌగోళిక పరిస్థితులతో రకరకాల సమస్యలూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు నీటికొరతతో సతమతమవుతుంటే.. మరికొన్ని ప్రాంతాలు వరదలతో ముంచెత్తుతాయి. అలాంటి ప్రాంతాల్లో లడఖ్ ఒకటి.. దేశసరిహద్దు ప్రాంతమైన లడఖ్‌లో వర్షపాతం చాలా తక్కువ. ఏడాదంతా ఇక్కడ 100 మి.మీ. అతితక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. దీంతో ప్రతి ఏడాది వసంతకాలం(రబీసీజన్)లో రైతులు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టింది మంచుస్తూపం ప్రయోగం.. ప్రపంచాన్నే ఆశ్చర్యపర్చింది ఈ అద్భుత ప్రయోగం..
లడఖ్ దశాబ్దాలుగా ఉన్న నీటి కొరత సమస్యకు చెక్ పెట్టేందుకు సామాజిక కార్యకర్త , ఇంజనీర్ సోనమ్ వాంగ్‌చుక్ మంచు స్థూపం (Ice Stupa) అనే ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. శీతాకాలంలో పర్వతాల నుంచి వచ్చే అదనపు నీటిని పైపుల ద్వారా గ్రామాల్లో ఒకచోటికి తీసుకువచ్చి చలిలో గడ్డకట్టేలా చేస్తారు. ఇలా శంఖాకారంలో ఏర్పడే భారీ మంచు గోపురాన్నే మంచు స్థూపం అంటారు. ఈ ఆకారంతో మంచు నెమ్మదిగా కరుగుతుంది. ఫలితంగా వసంతకాలంలో రైతులకు అవసరమైన సమయంలో నీరు అందుతుంది.
►ALSO READ | సీఎం కాన్వాయ్ కోసం.. మోమోస్ అమ్మే యువతిపై ఇంత రాక్షసంగా దాడిచేయాలా?..సోషల్ మీడియాలో పెద్దచర్చ
2014లో నిర్మించిన తొలి మంచు స్థూపం నిర్మించారు వాంగ్ చుక్.. ఈ స్తూపంతో సుమారు 1.5 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసింది. తరువాత నిర్మించిన పెద్ద స్థూపాలు లక్షల నుంచి మిలియన్ల లీటర్ల నీటిని నిల్వ చేసి, వేలాది మొక్కలకు సాగునీటిని అందించాయి. ప్రస్తుతం లడఖ్‌లో ఇలాంటి అనేక మంచు స్థూపాలు రైతులకు ఉపయోగపడుతున్నాయి.
ఈ ఆవిష్కరణకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. అంతర్జాతీయ అవార్డు కూడా లభించింది. తక్కువ ఖర్చుతో, విద్యుత్ అవసరం లేకుండా, ప్రకృతిని అనుసరిస్తూ నీటి సమస్యకు పరిష్కారం చూపడం దీని ప్రత్యేకత.
వాతావరణ మార్పులు పెరుగుతున్న ఈ కాలంలో, నీటిని ఆదా చేయడం ఎంత ముఖ్యమో సోనమ్ వాంగ్‌చుక్ ఆవిష్కరణ మనకు గుర్తు చేస్తుంది. ప్రకృతితో కలిసి పనిచేస్తే క్లిష్టమైన సమస్యలకు కూడా సులభమైన, శాశ్వత పరిష్కారాలు సాధ్యమని ఈ ప్రయోగం నిరూపించింది.