Reading Time: 2 minutes

యూట్యూబ్‌లో వీడియోలు చూసి నలుగురిని నరికేశాడు.. నల్గొండ మర్డర్ మిస్టరీ ఛేదించిన పోలీసులు

Caption of Image.

నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన  నలుగురి దారుణ హత్యల కేసు మిస్టరీని పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ సామూహిక హత్యల వెనుక ఉన్న అసలు నిందితులను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బు, బంగారంపై ఆశ.. వ్యక్తిగత కక్షల వల్లే ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. దారుణం ఏమిటంటే.. ఈ మొత్తం ఘాతుకానికి మృతురాలి అక్క కూతురు, అల్లుడే సూత్రధారులుగా మారడం స్థానికంగా కలకలం రేపుతోంది.

ఈ కేసుకు సంబంధించిన నమ్మలేని నిజాలను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వెల్లడించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు (A-1) సయ్యద్ అస్లాం.. హైదరాబాద్ గండిపేటకు చెందిన ఒక టాక్సీ డ్రైవర్. ఇతని భార్య తబస్సుం (A-2) మృతురాలికి అక్క కూతురు అవుతుంది. వీరితో పాటు బండ్లగూడకు చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ సోహైల్ (A-3), దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన జ్యువెలరీ షాప్ నిర్వాహకుడు హేమంత్ కుమార్ (A-4)లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ దారుణానికి ఒడిగట్టడానికి ముందు ప్రధాన నిందితుడు అస్లాం.. యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు చూసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య ఎలా చేయాలి? చేసిన తర్వాత పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి? అనే విషయాలపై నిందితుడు యూట్యూబ్‌లో క్షుణ్ణంగా రీసెర్చ్ చేశాడు.

ఆ ప్లాన్ ప్రకారమే.. అర్థరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి నలుగురిని కత్తితో నరికి కిరాతకంగా హతమార్చాడు. చివరకు ఎలాంటి సాక్ష్యం మిగలకూడదనే ఉద్దేశంతో.. 12 ఏళ్ల చిన్నారిని కూడా వదలకుండా ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత ఇంట్లోని ఐదు తులాల బంగారం, నగదు, ఆస్తి పత్రాలను దోచుకెళ్లాడు. దొంగిలించిన బంగారాన్ని జ్యువెలరీ షాప్‌లో కరిగించి తాకట్టు పెట్టి.. రూ.5.30 లక్షలతో పరారయ్యాడు.

అయితే పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎస్పీ ఏర్పాటు చేసిన 7 ప్రత్యేక బృందాలు నిందితుల వేట సాగించి.. నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నాయి. నిందితుల నుంచి రూ.30.04 లక్షల నగదు, ఒక మహీంద్రా మరాజో కారు, హత్యకు ఉపయోగించిన కత్తి, 3 సెల్‌ఫోన్లు, కరిగించిన ఐదు తులాల బంగారు ముద్దను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేసును అత్యంత వేగంగా, మూడు రోజుల్లోనే ఛేదించిన దర్యాప్తు బృందాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి, వారికి రివార్డులను ప్రకటించారు.

©️ VIL Media Pvt Ltd.