
దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -SIR) కు ఏడాది పూర్తయ్యింది. ప్రతిపక్షాలను దెబ్బకొట్టేందుకే సర్ తెచ్చారని.. ఎన్నికల కమిషన్ ను వాడుకుని.. విపక్ష పార్టీల సానుభూతి ఓట్లను తొలగించి లబ్దిపొందుతున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాయి. విమర్శలు, ఆరోపణల నడుమ ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ ఏడాది పూర్తి చేసుకుంది.
19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతుండగా, ఇప్పటివరకు దాదాపు ఆరు కోట్ల మంది ఓటర్లను తొలగించింది ఈసీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, 2025 జూన్ 24న బీహార్‌లో పైలట్ ప్రాజెక్టుగా SIR ప్రక్రియను ప్రారంభించారు
సరైన పత్రాలు లేవనే సాకుగా చూపి పౌరుల ఓటు హక్కును దొంగిలించడానికి ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని ప్రతిపక్షాలు, కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో బీహార్ లో దాదాపు 65 లక్షల ఓటర్లను తొలగించారు. మార్చిలో, ఎస్ఐఆర్ ను అమలు చేయాలన్న ఈసీ లక్ష్యాన్ని, సుప్రీం కోర్టు ఏకగ్రీవంగా సమర్థించింది.
పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో, SIR ప్రక్రియలో భాగంగా పేర్లు డిలీట్ అయిన వ్యక్తులకు రాష్ట్ర సంక్షేమ పథకాలు, ప్రయోజనాల నుంచి మినహాయిస్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత.. సర్ డేటాను సామాజిక భద్రతకు ఉపయోగించుకుంటున్నట్లు ఆ రెండు రాష్ట్రాలు ప్రకటించాయి.
అర్హులైన ఓటర్లను తొలగించకుండా.. అనర్హులు ఎవరూ ఓటర్ల లిస్టులో చేర్చకుండా చూసేందుకు SIRను ఉపయోగపడుతుందని ఎన్నికల సంఘం చెబుతోంది. అంతే కాకుండా సర్ ప్రక్రియ గురించి NCERT సోషల్ లో ఒక లెసన్ గా ఉండటం విశేషం. 2025 అక్టోబర్ 27న ప్రకటించిన రెండవ దశలో, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ – నికోబార్ దీవులు, లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాలలో సర్ ప్రక్రియను నిర్వహించారు. ఈ రాష్ట్రాలన్నింటిలో కలిపి సరాసరిగాఓటర్ల జాబితాను 10.2 శాతం మేర తగ్గించారు.
పైన పేర్కొన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్నికల పోలింగ్ కు ముందు ఓటర్ల సంఖ్య 50.99 కోట్లకు పైగా ఉంటే.. సర్ తర్వాత 45.81 కోట్లకు తగ్గింది. అంటే ఇది 5.18 కోట్లకు పైగా తగ్గిందన్న మాట. అంటే ఓటర్ల జాబితా 10.2 శాతం తగ్గింది.
మరణించిన మొత్తం ఓటర్లు 66 లక్షల 88 వేల 636 మంది ఓటర్లను లిస్టు నుండి తొలగించారు. వీరిలో ఎక్కువ ఉత్తర ప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాలలోనే ఉన్నాయి. యూపీలో 25.47 లక్షలు, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ నుండి 24.16 లక్షలు ఓట్లు తొలగించారు.
SIR ప్రక్రియలో అభ్యంతరాలు, విచారణ తర్వాత మొత్తం 63 లక్షల 16 వేల పేర్లను తొలగించారు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఫైనల్ లిస్టులను వేర్వేరు తేదీలలో విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్ ఈ డేటాను చివరిగా విడుదల చేసింది.
3వ దశలో భాగంగా.. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సర్ ప్రక్రియ జరగాల్సి ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక,మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ,మిజోరం,నాగాలాండ్ ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాజధాని ప్రాంతం, ఛండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ.. ఇలా మొత్తం 12 రాష్ట్రాలలో పెండింగ్ ఉంది.