Reading Time: < 1 minute
Iran Says Hormuz Strait To Reopen Within 30 Days Under Us Agreement

Iran: హార్ముజ్ జలసంధి త్వరలో తెరుచుకుంటుందని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంలో ఇది కూడా భాగమే అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అన్నారు. హార్ముజ్ జలసంధి రాబోయే 30 రోజుల్లో తిరిగి తెరుచుకుంటుందని, యుద్ధానికి ముందున్న స్థితికి వస్తుందని చెప్పారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆ దేశ విదేశాంగ మంత్రి ఫువాద్ హుస్సేన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో అరాఘ్చీ ఈ వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్‌లో ఏర్పాటు చేసిన అడ్డంకుల్ని ఇరాన్ తొలగిస్తుందని చెప్పారు. హార్ముజ్ పూర్తిగా ఇరాన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ కిందే పనిచేస్తుందని స్పష్టం చేశారు.

హార్ముజ్‌పై ఆధిపత్యం ఇరాన్‌దే అని, మరే సంస్థకు, ఏ దేశానికి కూడా ఇందులో బాధ్యత లేదని చెప్పారు. ఏదైనా దేశం జోక్యం చేసుకోవాలని చూస్తే మళ్లీ హార్ముజ్ ఓపెన్ ఆలస్యం అవుతుందని, ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్తల్ని పెంచుతుందని వార్నింగ్ ఇచ్చారు. లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడుల గురించి మాట్లాడుతూ.. ఒప్పందంలోని ఆర్టికల్ 1 ప్రకారం, లెబనాన్‌తో సహా అన్ని రంగాలలో శత్రుత్వం ముగియాలని చెప్పారు. అయినప్పటికీ, ఇజ్రాయిల్ దాడులు చేయడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ దాడుల్ని ఆపడం అమెరికా బాద్య అని అరాఘ్చీ స్పష్టం చేశారు.