Reading Time: 1 minute

సీఎం కాన్వాయ్ కోసం.. మోమోస్ అమ్మే యువతిపై ఇంత రాక్షసంగా దాడిచేయాలా?..సోషల్ మీడియాలో పెద్దచర్చ

Caption of Image.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కాన్వాయ్ రాకకు ముందు రోడ్డు పక్కన ఉన్న బండ్లను తొలగించే సమయంలో, మోమోస్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఓ యువతిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని యువతి ఆరోపించడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు తన బండిని బలవంతంగా తోసేయడంతో అది పడిపోయిందని, ఆ సమయంలో వేడి నీళ్లు తన చేతిపై పడి గాయమైందని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు భద్రతా చర్యల్లో భాగంగానే రోడ్డు ఖాళీ చేయించామని, ఎలాంటి దౌర్జన్యం  చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

అయితే నిజానిజాలు విచారణలో తేలాల్సి ఉన్నా, ప్రజల జీవనోపాధిపై ఇలాంటి చర్యలు తీవ్ర ప్రభావం చూపుతాయని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రోజువారీ కూలి, చిన్న వ్యాపారాలపై ఆధారపడే వారి బండి పడిపోతే అది కేవలం ఒక బండి కాదు, వారి కుటుంబానికి ఆ రోజు అన్నం దూరమైనట్టే అంటున్నారు. 

భద్రతా ఏర్పాట్లు అవసరమే.. కానీ వాటి పేరుతో పేదలపై దురుసుగా వ్యవహరించడం,  అవమానించడం ,బలప్రయోగం చేయడం సరైంది కాదంటున్నారు. చట్టాన్ని అమలు చేసే పోలీసులు ప్రజల పట్ల మానవత్వంతో, గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరంపై చర్చ సాగింది. 

ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు బయటపెట్టడంతో పాటు, ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకోవాలి. భద్రతతో పాటు పౌరుల హక్కులు, గౌరవం కూడా సమానంగా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నెటిజన్లు అంటున్నారు. 

©️ VIL Media Pvt Ltd.