Reading Time: 4 minutes

వీకెండ్ మిస్టరీ: ప్రపంచంలో అంతుచిక్కని రహస్యం.. ఆ నీటిలో మునిగితే రోగాలు మాయం.. వయసు తగ్గుతుంది !

Caption of Image.

మంత్రాలకు చింతకాయలు రాలవనేది ఒక సామెత. కానీ, ఆ కొలనుల్లోని నీళ్లు తాగినా, స్నానం చేసినా.. వయసు అమాంతం తగ్గిపోతుందట. జబ్బుల బారిన పడకుండా ఎక్కువ కాలం బతుకుతారట. అలాగని ఈ మంత్రాల కొలనులు ఎట్లా పుట్టాయి? ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. వేల సంవత్సరాల నుంచి అదొక నమ్మకంగా మిగిలింది. వందల ఏండ్ల తరబడి వాటి ఉనికి గురించి అన్వేషణ కొనసాగుతోంది. చరిత్ర పుస్తకాల్లో, ఆర్ట్ గ్యాలరీల్లో ఎక్కువగా కనిపించే ‘ఫౌంటెన్ ఆఫ్ యూత్’ గురించి ఈ వారం మిస్టరీలో…

ఒక పెద్ద ఫౌంటెన్… అందులో స్నానం చేయడానికి అన్ని ఏర్పాట్లు ఎక్కడెక్కడి నుంచో జనాలంతా అక్కడికి తరలి వస్తున్నారు. నగ్నంగా ఆ ఫౌంటెన్ లోకి దిగి ఈత కొడుతున్నారు. ఒడ్డుకి చేరి కేరింతలు కొడుతూ చిందులు వేస్తున్నారు. అందులో దిగగానే ఏదో మాయ జరిగినట్లు కొందరికి వయసు అమాంతం తగ్గిపోయింది. మరికొందరికి జబ్బులు తగ్గిపోయాయి. ఇంకొందరికి వైకల్యం ఉన్నట్టుండి మాయమైంది. ఇప్పటిదాకా చెప్పిందంతా నిజం కాదు. ఫౌంటెన్ ఆఫ్ యూత్ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే కనిపించే దృశ్యాలివి. 

ఎంతో మంది ఆర్టిస్టుల క్రియేటివిటీకి నిదర్శనమైన ఈ ఫౌంటెన్ నిజంగా ఉందనేది వాదన. ఆ వాదనని బలపరుస్తూ చరిత్రలోనూ ఈ తరహా కొలనులు, ఫౌంటెన్ల గురించి కొందరు ప్రస్తావించారు. ‘ఫాదర్ ఆఫ్ హిస్టరీ’గా పేరున్న హెరోడోటస్, క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో మ్యాజిక్ ఫౌంటెన్ గురించి తన పుస్తకాల్లో ప్రస్తావించాడు. క్రీస్తుశకం 3వ శతాబ్దంలో ‘ది అలెగ్జాండర్ రొమాన్స్’,11,12వ శతాబ్దాల్లో ‘ప్రెస్టర్ జాన్’ కథల్లో ఇలాంటి కొలనుల గురించి పేర్కొన్నారు. అన్నింటికంటే ఎక్కువగా 16వ శతాబ్దంలో కరేబియన్ దీవులు.. ‘ఏజ్ ఆఫ్ ఎక్స్ ఫ్లోరేషన్’లో యూత్ ఫౌంటెన్, కొలనుల మిస్టరీ గురించి చెప్పకనే చెప్పాయి.

హిస్టరీలో కొన్ని..

 వాటర్ తో హీలింగ్ ప్రక్రియ కొత్త విషయమేం కాదు. ఉప్పు, వేడి నీటి బుగ్గల్లో గంటల తరబడి కూర్చోవడం, ఈత కొట్టడం ఆరోగ్యానికి మంచిదని నమ్మేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. కానీ, వందల ఏండ్ల క్రితం ఈ తరహా నీటికి పవిత్రమైన హోదా ఇచ్చేవాళ్లు. క్యాసరీ ఐలాండ్స్, జపాన్, పోలినేసియా, ఇంగ్లాండ్ లో యూత్ ఫౌంటెన్లు ఉండేవని, వాటిని ప్రజలు పరమపవిత్రంగా చూసుకునేవాళ్లని హిస్టారియన్స్ చెప్తున్నారు. మధ్య యుగంలో ప్రజలు, ప్రత్యేకించి కొన్ని నదులు, జలపాతాలు, వాగులు, కొలనుల్లో అతీత శక్తులున్న నీరు ఉండేదని నమ్మేవాళ్లు. ప్రెస్టర్ జాన్ రాజు కథల్లో బంగారు నది, యూత్ ఫౌంటెన్లు ఉండేవని చెప్తారు. 

నాలుగో శతాబ్దపు పుస్తకాల్లో అలెగ్జాండర్ చక్రవర్తి ‘రివర్ ఆఫ్ ప్యారడైజ్ ‘ గురించి అన్వేషణ జరిపాడని రాసి ఉంది. అయితే అసలైన ‘ఫౌంటెన్ ఆఫ్ యూత్’కి కనెక్టివిటీ ఉన్న కథ మాత్రం స్పానిష్ అన్వేషకుడు వాన్ పొన్స్ డె లియన్కి సంబంధించింది. అతను పుట్టకముందే యూత్ ఫౌంటెన్ల గురించి కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ, వాన్ పొన్స్ సాగించిన అన్వేషణ, ప్రచారంలో ఉన్న కథలు.. ఫౌంటెన్ మిస్టరీని మరింత బలంగా చరిత్రలో నిలిపాయి.

పవర్ఫుల్ పర్సన్

టాయినో ఇండియన్స్, కరేబియన్ తెగల వాళ్లూ తరచూ ఫౌంటెన్ గురించి కథలు ప్రచారం చేసేవాళ్లు. ఉత్తర క్యూబాలో ఈ తరహా నది, ఫౌంటెన్ ఒకటి ఉండేదని చెప్తుండేవాళ్లు. ఈ విషయం వాన్ పొన్స్ చెవిన పడింది. ఇటలీ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ తో కలిసి అమెరికాను కనిపెట్టడంలో వాన్  పొన్స్ సాయం చేసినట్లు చెప్తుంటారు. అందుకుగాను కరేబియన్ ఐల్యాండ్స్ లోని హిస్పానిఒలాలో వందల ఎకరాలపై పెత్తనం చేసే అధికారం అతనికి దక్కింది. 

పొన్స్ చాలా తెలివైనవాడు. స్థానిక తెగల్ని మచ్చిక చేసుకోవడం అతనికి తెలుసు. ఆ తర్వాత వాళ్లపై అధికారం చెలాయించేవాడు. ఈ క్రమంలో తెగ ప్రజలతో అతను ఆ భూముల్లో వ్యవసాయం చేయించాడు. ఆ తర్వాత పోర్టో రికోకి గవర్నర్ గా కూడా పని చేశాడు. అయితే కొలంబస్ కొడుకు డియాగో ఎంట్రీతో సీన్ మొత్తం మారింది.

 అధికారం మొత్తం పోవటంతో పొన్స్.. బహమాస్ లోని బిమిని ఐల్యాండ్ కు చేరుకున్నాడు. ఆ టైంలో అక్కడ రూలర్ గా ఉన్న కింగ్ ఫెర్డినాండ్, పొన్సికి ఆ ద్వీపంలో ఉండేందుకు అనుమతించాడు. అయితే ఆ ద్వీపంలోని ‘ఫౌంటెన్ ఆఫ్ యూత్’ గురించి పొన్స్ కు సమాచారం తెలుసని, అందుకే అతని ఖర్చు మొత్తం ఫెర్డినాండే భరించాడని ఒక ప్రచారం ఉంది.

ఫౌంటెన్ రహస్యం

బిమిని ఐల్యాండ్లో ఫెర్డినాండ్, పొన్స్ ల మధ్య ఒక డీల్ జరిగింది. ఆ ఒప్పందంలో ఫౌంటెన్ ఆఫ్ యూత్ ప్రస్తావన ఉండటం విశేషం. కానీ, పొన్స్ ఏనాడూ ఏ ఫౌంటెన్ గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదు. అతని జీవితకాలంలో ఎన్నో దీవుల్ని కనిపెట్టే ప్రయత్నం చేశాడు. ఆ వంకతో యూత్ ఫౌంటెన్ల గురించి రహస్య అన్వేషణ సాగించాడని, ఎన్నింటినో కనిపెట్టాడనే ప్రచారం ఉంది. కానీ, మైకేల్ ఫ్రాన్సిస్ అనే హిస్టారియన్ మాత్రం పొన్స్ కు అలాంటి ఆసక్తి ఏనాడూ లేదని చెప్పటం విశేషం. ‘పొన్ కి మూఢనమ్మకాలు లేవు. ఫౌంటెన్ ఆఫ్ యూత్ విషయాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. అప్పటి రచనల్లో కూడా అలాంటి విషయం ఎక్కడా పేర్కోలేదు’ అని ఫ్రాన్సిస్ తన థీసిస్లో రాశాడు.

కల్చర్ లో ఇలా..

ఫౌంటెన్ ఆఫ్ యూత్ కథ.. ఇప్పటికీ హిస్టరీలో సజీవంగానే ఉంది. ఆంటోనియో డె హెర్రెరా అనే రచయిత 1601లో వాన్ పొన్స్ డె లియన్ చేసిన మొదటి అడ్వెంచర్ గురించి ఒక కథ రాశాడు. అందులో పడవ ఒక చోటుకి చేరుకోగానే.. అందులో ఉన్న ముసలివాళ్లంతా పిల్లలుగా మారారని పేర్కొన్నాడు. అయితే యూత్ ఆఫ్ ఫౌంటెన్ల గురించి అమెరికా మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. హెరొటోడోస్ రాసిన థియరీలో ‘మాక్రోబియాన్స్ నివసించిన నేల మీద ఇలాంటి ఫౌంటెన్లు ఎన్నో ఉండేవి. వాళ్లు ఎక్కువ కాలం బతకడానికి అవే కారణం’ అని ఉంది.

 ఇచియోఫగోయ్ కథల్లో సముద్ర తీరంలో నివసించే ప్రజల జీవితకాలం 120 ఏళ్ల దాకా ఉండేదని ఉంది. ఈ రెండింటితో పాటు బిమిని.. హిస్పానిఒలా దీవులకు పొన్స్తో లింకు ఉండటంతో అమెరికన్ హిస్టారియన్స్ లో అనుమానాలు పెంచింది. ఆఖరికి వాషింగ్టన్ ఇర్వింగ్ లాంటి ఆర్టిస్టులు కూడా బొమ్మలు గీయటంతో.. ఫౌంటెన్ల గురించి అన్వేషణ మొదలైంది.

అయితే 20వ సెంచరీలో మ్యాజిక్ ఫౌంటెన్ల ద్వారా టూరిస్టుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఫ్లోరిడా పాత నగరం సెయింట్ అగస్టీన్ సెంట్రల్ ప్లాజా వద్ద టూరిస్ట్ ఎట్రాక్షన్ కోసం ఒక ఫౌంటెన్ను ఏర్పాటు చేశారు. ఫ్లోరిడాలోని మెల్ బోర్న్ బీచ్ వద్ద అడుగుపెట్టిన తొలి యూరప్ అన్వేషకుడు పొన్స్. అతని గౌరవార్థం 500 ఏళ్ల తర్వాత అంటే 2013లో బీచ్ వద్ద ఒక పార్క్ ఏర్పాటు చేశారు. 15 ఎకరాల ప్లేస్లో వైల్డ్ లైఫ్ నడుమ 
ఒక ఫౌంటెన్ కూడా ఉంది. 

అయితే ఆ ఫౌంటెన్ సహజంగా ఏర్పడింది కావడం విశేషం. 1875లో ఇది వెలుగులోకి వచ్చింది. 500 అడుగుల లోతు నుంచి నీరు దానికదే ఉబికి పైకి వస్తుంది. రోజుకి 10 వేల మంది టూరిస్టులు ఈ పార్క్కి వస్తుంటారు. అంతేకాదు జనాలు ఆఫౌంటెన్ నీళ్లను టేస్ట్ చేయడానికి అనుమతి ఉంది.

నిజంగా ఉందా? 

ఉత్తర బిమినికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉప్పు నీటి చిత్తడి నేలలు ఉన్నాయి. అక్కడ ‘హీలింగ్ హోల్’ ఒకటి ఉంది. వరద ప్రవాహం, చెట్ల వేర్ల కారణంగా ఈ ప్రాంతంలో నీరు చప్పగా ఉంటుంది. దీనికి తోడు క్యాల్షియం. మెగ్నీషియం రాళ్ల గర్భంలో ఉంటాయి. అయితే సముద్రపు నీరు ఉప్పొంగి ముందుకొచ్చినప్పుడు ఇక్కడ నీరు రుచి మారుతుంది. చాలామంది ఈ ప్రాంతంలో ఈత కొట్టి, హీలింగ్ కు గురైనట్లు ఫీలవుతుంటారు. 

అయితే పొన్స్ కనిపెట్టిన ఫౌంటెన్ ఇదేనా? లేక వేరేది ఉందా? ఒకవేళ ఉంటే ఎందుకు ఆయన దానితో యవ్వనం పొందలేకపోయాడు? ఇలాంటి ప్రశ్నలెన్నో.. సమాధానాలు లేకుండా మిగిలిపోయాయి. అయితే ఫౌంటెన్ ఆఫ్ యూత్ వల్ల ఫ్లోరిడా ఫ్యూచర్ మారిపోతుందనే భయంతోనే ఆయన దాని గురించి ఎక్కడా పేర్కొనలేదని హిస్టారియన్స్ అభిప్రాయపడుతుంటారు. ఈ కథ అక్కడితో ఆగిపోలేదు. యవ్వనాన్ని ప్రసాదించే నీటి కోసం భూమిని జల్లెడ పట్టే ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది.

1535లో స్పెయిన్ అన్వేషకుడు వాన్ పొన్స్ డె లియన్ చనిపోయిన కొన్నాళ్లకు గోంజలెజ్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తి విచిత్రమైన ఆరోపణలు చేశాడు. పొన్స్ కు సెక్సువల్ ఇంపొటెన్సీ (వంధ్యత్వం) ఉందని, మ్యాజిక్ ఫౌంటెన్ ద్వారా ఆ సమస్యను నయం చేసుకునేందుకు ఎంతో ప్రయత్నించాడని గోంజలెజ్ చెప్పాడు.

అయితే వర్జీనియా యూనివర్సిటీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్ ర్యాన్ కె స్మిత్ మాత్రం ఆ ఆరోపణల్ని కొట్టిపడేశాడు. ఫ్లోరిడాలో అడుగుపెట్టే సమయానికి పొన్స్ కు పిల్లలు ఉన్నారని ర్యాన్ తన థీసిస్ లో తగిన ఆధారాలతో పేర్కొన్నాడు. ‘యూత్ ఫౌంటెన్ పై ఎన్ని కథలు ఉన్నా.. కరేబియన్ దీవుల్లోని కొన్ని చోట్ల నీటి బుగ్గల్ని జనాలు ఇప్పటికీ పూజిస్తున్నారంటున్నాడు స్మిత్.

శుభాశ్రీ

©️ VIL Media Pvt Ltd.