Reading Time: 2 minutes
Mumbai Police Foil Muharram Procession Poisoning Plot Faiyaz Premji Arrested Zinc Phosphide

Mumbai Muharram Plot: ముంబైలో మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని సాగిన ఒక భయంకరమైన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జులూస్‌లో పాల్గొన్న భక్తులకు ‘నొప్పి నివారణ మాత్రలు’ అంటూ విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న ఒక నిందితుడిని ముంబై పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి దాదాపు 14,900 విషపు క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని జేజే – భాయ్‌ఖలా ప్రాంతాల గుండా మొహర్రం ఊరేగింపు సాగుతున్న సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడు ఎలాంటి అనుమతి లేకుండా అక్కడ ఉన్న జనానికి కొన్ని క్యాప్సూల్స్ ఉచితంగా పంపిణీ చేస్తుండటాన్ని గస్తీ తిరుగుతున్న పోలీసులు గమనించారు. అనుమానం వచ్చి అతడిని విచారించగా అసలు నిజం బయటపడింది. నిందితుడిని పూణేలోని విమాన్ నగర్‌కు చెందిన పెయింట్ వ్యాపారి, బీబీఏ గ్రాడ్యుయేట్ అయిన ఫయాజ్ ప్రేమ్‌జీగా గుర్తించారు.

50 కిలోల ఎలుకల మందు.. 30 వేల ఖాళీ క్యాప్సూల్స్

సెంట్రల్ రీజియన్ జోన్-1 డీసీపీ జయంత్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. ఊరేగింపులో పాల్గొన్న జనానికి పెద్ద ఎత్తున హాని తలపెట్టాలనే ఉద్దేశంతోనే ఫయాజ్ ఈ కుట్రకు తెరలేపాడు. ఇందుకోసం అతను మార్కెట్ నుంచి 30,000 ఖాళీ క్యాప్సూల్స్, 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్ (ఎలుకలను చంపే అత్యంత ప్రమాదకరమైన విష రసాయనం) కొనుగోలు చేశాడు. ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో గల ఒక గెస్ట్ హౌస్‌లో బస చేస్తూ.. కొన్ని రోజుల పాటు ఒక్కో క్యాప్సూల్‌లో ఒక గ్రాము చొప్పున ఈ ఎలుకల మందును నింపి రెడీ చేశాడు. ఈ విషపూరిత మాత్రలను మింగిన సల్మాన్ సయ్యద్ అనే వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో ఆసుపత్రిలో చేరడంతో ఈ కుట్ర తీవ్రత బయటపడింది.

ఏడాదిలో 19 సార్లు ఇరాన్, ఇరాక్ ప్రయాణాలు

పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడికి సంబంధించిన పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. ఫయాజ్ ప్రేమ్‌జీ ‘షియా ఖోజా ముస్లిం’ కమ్యూనిటీకి చెందినవాడని, అతని సోదరి, తల్లి ఇరాన్‌లో నివసిస్తున్నారని తెలిసింది. అయితే 2019 – 2025 మధ్య కాలంలో అతను పలుమార్లు ఇరాన్, ఇరాక్ దేశాలకు వెళ్లాడు. మరీ ముఖ్యంగా గత ఏడాది కాలంలోనే ఏకంగా 19 సార్లు ఇరాన్, ఇరాక్ దేశాల్లో పర్యటించడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం నిందితుడిపై సెక్షన్ 109, 110, 123 కింద విషప్రయోగం, హత్యాయత్నం కేసులు నమోదు చేసి భాయ్‌ఖలా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఏ ఉగ్రవాద సంస్థతోనూ ఇతనికి ఉన్న లింకులు అధికారికంగా ఖరారు కాలేదు. అయితే అతను ఎవరి ప్రభావంతో ఇంత పెద్ద కుట్రకు పాల్పడ్డాడు? పదే పదే విదేశాలకు ఎందుకు వెళ్లాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి మొబైల్ ఫోన్, డిజిటల్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.