Reading Time: < 1 minute

వారం రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Caption of Image.
  • రుతుపవనాల ప్రభావంతో 
  • పలు జిల్లాల్లో వర్షం
  • ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  • టెంపరేచర్లు తగ్గినా.. వేడి, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి

హైదరాబాద్, వెలుగు: రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. రాబోయే వారం రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో టెంపరేచర్లు తగ్గుతున్నా వేడి మాత్రం ఎక్కువగా ఉంటున్నది. వేడికి తోడు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉన్నది. మరోవైపు శనివారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి.

 మహబూబాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జనగామ, భువనగిరి, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం,  గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడలో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

 జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా దుర్షేడులో 5.9 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 5.6, మెదక్ జిల్లా రామాయంపేటలో 5.4, జగిత్యాల జిల్లా వెల్గటూరులో 5.1, మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారంలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
 

©️ VIL Media Pvt Ltd.