
- కర్నాటక, ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు తీవ్ర నష్టం: ఎన్.రాంచందర్ రావు
- పాస్‌పోర్ట్ ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే.. పౌరసత్వానికి రుజువు కాదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తుంగభద్ర నది నీటి వాటాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు. కర్నాటక, ఏపీల్లోని ప్రాజెక్టులతో తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల వాటా దెబ్బతిని, కేవలం 5 టీఎంసీలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ ఏం మాట్లాడారో, రాష్ట్రానికి ఎలాంటి హామీలు తెచ్చారో ప్రజలకు వివరించాలన్నారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.
గతంలో కృష్ణా, గోదావరి బేసిన్లలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్కారు రెండు కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని తెలిపారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ అంశాలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్‌పోర్ట్ అనేది కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని, అది పౌరసత్వానికి రుజువు కాదని 2013లో బాంబే హైకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు.
1967 పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం విదేశీయులకు కూడా కేంద్రం పాస్‌పోర్ట్ ఇచ్చే చాన్స్ ఉందని, బారిస్టర్ చదివిన ఒవైసీకి ఈ విషయం తెలియదా అని ఎద్దేవా చేశారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ వలసదారుల ఓట్ల కోసమే కాంగ్రెస్, ఎంఐఎం కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. ఓటరు నమోదుకు పాస్‌పోర్ట్ అనేది 12 రకాల పత్రాల్లో ఒకటి మాత్రమేనన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు వీరేందర్ గౌడ్, దేవకి వాసుదేవరావు, ఎన్వీ సుభాష్, తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.