
ఎన్నో పోషక విలువలున్న ఖర్జూరాలను చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, మార్కెట్లో ఖర్జూరాలు కొనేటప్పుడు వాటి గడువు తేదీని గమనించకపోతే ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆహార భద్రతా అధికారులు, పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు పలుచోట్ల గడువు ముగిసిన ఖర్జూరాలను సీజ్ చేస్తుండటం గమనార్హం. వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్జూరాన్ని దిగుమతి చేసుకునే దేశం భారతదేశం. మనదేశం ఏటా రూ. 2,000 కోట్లకు పైగా విలువైన ఖర్జూరాలను వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువ శాతం యూఏఈ నుండి వస్తుండగా, ఇరాక్, ఇరాన్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఖర్జూరాల నిల్వపై డబ్ల్యూహెచ్‌ఓ నిర్దిష్ట నిబంధనలు ఏవీ చెప్పనప్పటికీ.. సాధారణంగా వీటిని ఆరు నెలల నుండి ఏడాది వరకు సురక్షితంగా తినవచ్చని అధికారులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్ స్వభావం ఉన్నందున, దిగుమతి అయినప్పటి నుండి గరిష్టంగా ఒక సంవత్సరం గడువుతో ప్యాకింగ్ చేస్తారు. అంతకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచితే ఇవి సహజంగానే చెడిపోతాయి. ఖర్జూరాలు చెడిపోయినట్లు సాధారణంగా కంటికి కనిపించకపోవడమే అతిపెద్ద సమస్య. అధిక వేడి, తేమ ఉన్న ప్రదేశాలలో నిల్వ ఉంచితే ఖర్జూరాలకు బూజు పడుతుంది. ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే ‘అఫ్లాటాక్సిన్’ అనే విషపూరిత మైకోటాక్సిన్‌లను విడుదల చేస్తుంది. ఇది నేరుగా కాలేయం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ఫంగస్ వేగంగా పెరుగుతుంది. బూజు పట్టిన ఖర్జూరాలు తింటే వాంతులు, తలతిరగడం వంటి సమస్యలు వస్తాయి. నిల్వ ఎక్కువైతే పురుగులు, కీటకాలు కూడా చేరతాయి. కొన్ని రకాల ఖర్జూరాలు ముదురు నలుపు రంగులోకి మారకుండా, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ‘సల్ఫేట్లను’ కెమికల్ ప్రిజర్వేటివ్స్‌గా కలుపుతుంటారు. ఈ సల్ఫేట్లు విచ్ఛిన్నమైనప్పుడు ఆస్తమా, అలర్జీ వంటి శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఖర్జూరంలో విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి ఎన్నో మంచి పోషకాలు ఉన్నప్పటికీ, కొనేటప్పుడు ప్యాకెట్లపై ఉండే లేబుళ్లను, ఎక్స్‌పైరీ డేట్‌ను ఖచ్చితంగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అధిక బరువుతో గుండె జబ్బులే కాదు.. 19 రకాల క్యాన్సర్ల ముప్పు!
కీర దోసకాయ వీరికి విషంతో సమానం!
వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్’తో మతిమరుపు మాయం