Reading Time: < 1 minute

అమెరికా కాగిత కరెన్సీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉండనుంది. 250 ఏళ్ల స్వాతంత్య్రం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ శాఖ గురువారం ప్రకటించింది. ప్రస్తుత పదవిలో ఉన్న అధ్యక్షుడి సంతకం కరెన్సీపై ముద్రించబడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నిర్ణయంతో 165 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి కూడా తెరపడింది. 1861లో ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ట్రెజరర్ సంతకం కరెన్సీపై తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు మొదటిసారి ఆ సంతకాన్ని తొలగిస్తున్నారు.ట్రెజరీ వివరాల ప్రకారం, ట్రంప్ సంతకం, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సంతకాలతో కూడిన తొలి 100 డాలర్ల నోట్ల ముద్రణ జూన్‌లో ప్రారంభం కానుంది. తరువాతి నెలల్లో ఇతర నోట్లపై కూడా ఈ మార్పులు అమలవుతాయి. ఈ నిర్ణయం దేశ ఆర్థిక ప్రగతిని ప్రతిబింబిస్తుందని ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ పేర్కొన్నారు.

దేశ విజయాలు, 250వ వార్షికోత్సవాన్ని గుర్తుచేసే విధంగా ట్రంప్ పేరును కరెన్సీపై ముద్రించడం సముచితమని ఆయన అన్నారు.ఇదే సమయంలో అమెరికా ట్రెజరర్ బ్రాండన్ బీచ్ కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఇది సరైనదే కాకుండా సముచిత గౌరవమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మాత్రం మాజీ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలెన్, ట్రెజరర్ లిన్ మలెర్బా సంతకాలతో ఉన్న నోట్ల ముద్రణ కొనసాగుతోంది. 1861 నుంచి కొనసాగుతున్న ట్రెజరర్ సంతకాల సంప్రదాయానికి మలెర్బా సంతకం చివరిది కానుంది. ఇక 250వ వార్షికోత్సవ వేడుకల భాగంగా ట్రంప్ గౌరవార్థం మరిన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇప్పటికే ఆయన చిత్రంతో 24 క్యారెట్ బంగారు స్మారక నాణెం రూపకల్పనకు అనుమతి లభించింది. ఈ నాణెం జూలై 4 స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా విడుదల కానుంది.