Reading Time: < 1 minute

వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 12.26కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లికి చెందిన హేమా చంద్రకాంత్ హట్‌వాలే, సాకేత్ శంకర్, కసాబ్ రాజు ముగ్గురు గంజాయి విక్రయిస్తుండగా వారికి శివరాజ్ హట్ గడ, అక్షయ్, జావెద్ సహకరిస్తున్నారు. నిందితులు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లిన ఎక్సైజ్ సిబ్బంది హేమా చంద్రకాంత్ హట్‌వాలే, సాకేత్ శంకర్, కసాబ్ రాజును అరెస్టు చేయగా మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 10.16కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

కేసు దర్యాప్తు కోసం ముగ్గురు నిందితులను నాంపల్లి పోలీసులకు అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 2.1కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని శివసాయి నగర్‌లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ సిబ్బంది నిఘా పెట్టారు. మహ్మద్ అర్బాజ్, సయ్యద్ ఇస్రా ఉద్దిన్‌ను అరెస్టు చేశారు. గంజాయి విక్రయాలతో సంబంధం ఉన్న మరో ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు.