Reading Time: < 1 minute

యుద్ధ వాతావరణంలో పలు దేశాలు తలడిల్లుతున్న నేపథ్యంలో ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యమని, శ్రీలంక బుద్ధ శాసన, సాంస్కృతిక వ్యవహారాల శాఖా మంత్రి ఆచార్య హినీదుమే సునీల్ సెనేవి అన్నారు. ఋద్ధవనం, వియత్నాం బౌద్ధ సంఘం సంయుక్తంగా బేగంపేట్ లో ది ప్లాజా హోటల్లో నిర్వహిస్తున్న ప్రపంచ శాంతి పై అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో శుక్రవారం ఆయన, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావులు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక వలయాన్ని అభివృద్ధి చేసి, బుద్ధవనాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం చొరవ చూపిస్తుందన్నారు. బుద్ధుని బోధనలు ఆచరిస్తే శాంతి దానంతట అదే చేకూరుతుందని మంత్రి తెలిపారు. వియత్నాం బౌద్ధ సంఘ అధ్యక్షులు పూజ్యనీయ తిచ్ నాత్ తు ప్రసంగిస్తూ, శాంతి ముందుగా వ్యక్తుల మనసులో ప్రారంభమవుతుందని, సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుందన్నారు. నవనలంద మహా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్ ఆచార్య సిద్ధార్థ సింగ్ కీలకోపన్యాసం చేస్తూ,

కుశల ఆలోచనలు, చర్యలు, మనిషిని సర్వతోన్నతునిగా తీర్చిదిద్ది, సమాజ హితానికి తోడ్పడుతుందని, ఆ ఉద్దేశంతో ప్రపంచ ఐక్యరాజ్యసమితి ఏర్పడిందని, బౌద్ధాన్ని ఆచరిస్తే యుద్ధాలకు తావుండదని పేర్కొన్నారు. సదస్సులో శ్రీలంక బౌద్ధ భిక్షు, ఆచార్య కసప్ప మహా ధేరో, రష్యా బౌద్ధ సంఘ, అధ్యక్షులు, అండ్రే దొందుకుబెవ్, లావోస్ కేంద్ర బౌద్ధ సంఘ, అధ్యక్షులు, వంఖరి వాంగ్ ససులిన్, మహాబోధి సొసైటీ, జనరల్ సెక్రెటరీ, ఆనందబిక్కు ప్రసంగించారు. బౌద్ధ సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా, శ్రీలంక మంత్రి ఆచార్య హనీ దుమీ, రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు జూపల్లి కృష్ణారావు, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, తీచ్ నాత్ తులకు అంతర్జాతీయ అవార్డులు అందజేసి మూన్ యాంగ్ జో సత్కరించారు. బుద్దవనం ప్రత్యేక అధికారి లక్ష్మయ్య మాట్లాడుతూ 22 దేశాల నుంచి 80 మంది ప్రతినిధులు సదస్సులో ప్రసంగించారని చెప్పారు.