
కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ తన సలహాదారుల ప్రభావంలో ఉండి, వారు చెప్పినట్లే పార్లమెంట్‌లో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. సభలో టీ-షర్ట్ ధరించి హాజరుకావడం కూడా సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ‘టైమ్స్ నౌ సమ్మిట్’లో మాట్లాడుతూ, వ్యక్తిగతంగా రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి సమస్యలేదని, సభ బయట సౌహార్దంగా మాట్లాడుకుంటామని చెప్పారు. అయితే సభలో అధికారికంగా మాట్లాడేటప్పుడు నియమాలు, సంప్రదాయాలు, మర్యాదలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.రాహుల్ గాంధీ మనసు ఆయన కార్యకర్తలైన సలహాదారుల చేతుల్లో ఉంది. వారు చెప్పిందే ఆయన సభలో చెబుతున్నారు అని రిజిజు విమర్శించారు.
బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు వ్యక్తం చేసినా కొన్ని పరిమితులు పాటించిందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ దుస్తులపై ప్రశ్నించగా, ఆ పదవికి తగిన విధంగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఉందని, దుస్తులు కూడా అందులో భాగమేనని రిజిజు వ్యాఖ్యానించారు. టీ-షర్ట్ వేసుకోవడంపై అభ్యంతరం లేదు కానీ అది సభలో కాదు అని అన్నారు.లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీని ఉదాహరణగా పేర్కొంటూ, స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తన దుస్తుల శైలిని మార్చుకుని మరింత గౌరవప్రదంగా కనిపించేవారని తెలిపారు. ప్రతిపక్షానికి నాయకుడిగా ఉండటం వల్ల, ఆ పదవికి తగిన ప్రతిష్ఠను ప్రతిబింబించేలా వ్యవహరించాలని సూచించారు. రాహుల్ గాంధీ రాజకీయ విధానం విరుద్ధతలతో నిండి ఉందని, ప్రభుత్వ విజయాలను ప్రతిసారీ ప్రశ్నించడం, ప్రతి చర్యను వ్యతిరేకించడం ఆయన ధోరణిగా కనిపిస్తోందని రిజిజు విమర్శించారు.