
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదని, బుధవారం కంటే గురువారం పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గిందని ఐపిఎస్,సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 484 ట్రక్కుల గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేశామని, బుధవారం 2,19,980 సిలిండర్లను సరఫరా చేశామని కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలో గృహ వినియోగానికి సంబంధించి 1,28,24,087 ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని,
ప్రతి రోజు 2,20,000 గ్యాస్ బుకింగ్స్ జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే, 1,03,275 పైప్ న్యాచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లు ఉన్నాయని, 2,78,418 క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. కేంద్రం ఆదేశాల మేరకు పిఎన్జీ, సిఎన్జీని విస్తరించాల్సి ఉందని ఆయన చెప్పారు. 24 గంటల్లో ప్లాంట్లకు అనుమతి ఇవ్వడంతో పాటు పలు రాయితీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.