
మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొర త అధికమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల పైచిలుకు బంక్ లు ఉండగా అందులో 50 శాతానికి పైగా బంక్‌ల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం బం క్‌ల వద్ద క్యూలైన్‌లు ప్రారంభం కాగా, బుధవారం క్యూ లై న్‌ల ఉధృతి మరింతగా పెరిగింది. క్యూలైన్‌లో ఉన్న వారికే పె ట్రోల్, డీజిల్ లభిస్తుండడంతో రోడ్లపై కార్లు, ద్విచక్రవాహనా లు, ఆటోలు నిలుపుతుండడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. వాహనదారులు తమ వాహనాలతోనే కా కుండా, ప్లాస్టిక్ క్యాన్లు, బాటిళ్లతో బంకులకు చేరుకోవడం విశేషం. ఈ నేపథ్యంలోనే పెట్రోల్‌బంక్ యజమానులు వాహనాలకు రేషనింగ్ పద్ధతిని అవలంభిస్తున్నారు. రేషనింగ్ పద్ధ తి అంటే ద్విచక్ర వాహనాలకు 200 రూపాయల పెట్రోల్‌ను, కార్లు, ఫోర్ వీలర్ వాహనాలకు రూ.2వేల పెట్రోల్, డీజిల్‌ను మాత్రమే పోస్తున్నారు.
పెట్రోల్ కొరత ఏర్పడుతుందేమో అ న్న భయంతో అర్ధరాత్రి వేళ కూడా నిద్ర మానుకొని గంటల తరబడి లైన్లో వేచి ఉంటున్న ఫొటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో బంక్‌ల వద్ద పో లీసుల బందోబస్తును ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిం ది. ప్రస్తుతం రాష్ట్రంలో 60 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వ లు ఉన్నాయని ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని వాహనదారు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంగళవారం, బు ధవారాల్లో 25 శాతం అధికంగా ఆయిల్ కావాలని బంక్ య జమానుల నుంచి డీలర్‌లకు ఇండెంట్ రావడంతో ఇబ్బందు లు ఎదురవుతున్నాయని ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే, సరిపడా ట్యాంకర్‌లు అందుబాటులో లేకపోవడం కూడా ఆ యిల్‌ను సకాలంలో పంపిణీ చేయలేకపోతున్నామని డీలర్‌లు పేర్కొంటున్నారు.
క్రెడిట్ ఎత్తివేసిన డీలర్‌లు
గతంలో పెట్రోల్‌బంక్‌లకు డీలర్‌లు క్రెడిట్ ఇచ్చేవారు. పెట్రోల్, డీజిల్‌ను విక్రయించిన తరువాత 3 రోజులు లేదా 5 రోజుల్లోపు ఆ డబ్బులను బంక్ యజమానులు డీలర్‌లకు చెల్లించేవారు. ప్రస్తుతం యుద్దవాతావరణ నేపథ్యంలో క్రెడిట్ లైన్‌ను (ఉద్దెర) డీలర్‌లు ఇవ్వడం లేదు. దీంతోపాటు బంక్ యజమానులు డబ్బులు కట్టి ఇండెంట్ పెట్టినా సమయానికి డీలర్‌లు ట్యాంకర్‌లను సరఫరా చేయలేకపోవడంతో బంక్‌ల్లో నోస్టాక్ పెట్టాల్సి వస్తోందని బంక్ యజమానులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం డీలర్‌ల దగ్గర 12 (కెఎల్) వేల లీటర్ల ట్యాంకర్‌లకు (రూ.12 లక్షలు) నుంచి 25 (కెఎల్) వేల లీటర్లకు (రూ.29 లక్షల)ను బంక్‌ల యజమానులు చెల్లిస్తేనే ట్యాంకర్‌లను డీలర్‌లు పంపిస్తున్నారు.
బంక్ యజమానుల నుంచి ఒత్తిడి
అయితే, రాష్ట్రవ్యాప్తంగా బంక్‌ల యజమానుల నుంచి ఆయిల్ కోసం ట్యాంకర్‌ల కోసం ఒత్తిడి వస్తుండడంతో సమయానికి డీలర్‌లు సైతం ట్యాంకర్‌లను సరఫరా చేయలేకపోతున్నామని డీలర్‌లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చర్లపల్లి, మల్కాపురం, రామగుండంలలో ఆయిల్‌ను నిల్వ చేసే ప్లాంట్‌లు ఉన్నాయి. హెచ్‌పి ఆయిల్ కార్పొరేషన్‌కు ఘట్‌కేసర్, వరంగల్‌లో ప్లాంట్‌లు ఉండగా, భారత్ ఆయిల్ కార్పొరేషన్‌కు వరంగల్, రామగుండంలో ఆయిల్ నిల్వ చేసే ప్లాంట్‌లు ఉన్నాయి.
వాహనదారులు వినడం లేదు: బంక్ యజమానులు
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉన్న పెట్రోల్ బంకులు తెల్లవారుజాము నుంచే వాహనదారులతో రద్దీగా కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టాయి. ఆటోలు, కార్లు, కంటైనర్లు కూడా పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నాయి. ఎవరి నోట చూసిన ఫుల్ ట్యాంక్ మాటే వినిపిస్తుండటంతో బంకుల్లో ఉన్న పెట్రోల్, డీజిల్ ఖాళీ అవుతుంది. మళ్లీ వాటిని నింపేందుకు సమయం పడుతుండటం వల్లే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తోందని, తీవ్రమైన కొరత ఉందన్నది అవాస్తవమని బంకుల యజమాన్యాలు చెబుతున్నాయి. ఇంధన కొరత లేదని ఎంత చెబుతున్నా వాహనదారులు వినడం లేదని బంక్ యజమానులు వాపోతున్నారు.
ఇంధన కొరత పూర్తిగా అవాస్తవం: పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
రాష్ట్రంలో ఇంధన కొరత ఉందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. కొన్ని రోజులుగా పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఉందన్న వార్తల ప్రచారంపై అసోసియేషన్ స్పందించింది. హెచ్‌పిసిఎల్, ఐఓసీఎల్, బిపిసిఎల్ కంపెనీల వద్ద సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉందని, ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. విపరీతమైన రద్దీ కారణంగా కొన్ని బంకుల్లో తాత్కాలికంగా ఇంధన కొరత ఏర్పడిందని, దీనిని ఇంధన కొరతగా భావించవద్దని అసోసియేషన్ తెలిపింది. వినియోగదారులు పుకార్లను నమ్మవద్దని, ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది. ఇంధనం దొరకదన్న భయంతో బంకుల వద్ద క్యూ కడుతున్నారని, నిల్వలు ఉంచుకునేందుకు ముందస్తు కొనుగోళ్లతో ఇబ్బంది ఏర్పడుతోందని అసోసియేషన్ తెలిపింది.
హైదరాబాద్ టు -విజయవాడ నేషనల్ హైవే పై భారీగా ట్రాఫిక్ జాం
జంట నగరాల్లో నెలకొన్న ఇంధన సెగ ప్రభావం కేవలం నగరం లోపలే కాకుండా ప్రధాన రహదారులపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్- టు విజయవాడ నేషనల్ హైవేపై ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. బంకుల వద్ద వాహనాల క్యూలైన్లు ప్రధాన రోడ్లపైకి రావడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల పలు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో ఇంధన కొరత లేదని, ఆయిల్ కంపెనీల వద్ద సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని అధికారులు పదేపదే స్పష్టం చేస్తున్నప్పటికీ, ప్రజల్లో నెలకొన్న సందేహాల కారణంగా బంకుల వద్ద ఈ రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పలు మెట్రో నగరాల్లోని పలు బంక్‌ల్లో నోస్టాక్ అన్న బోర్డులు దర్శనమిస్తుండడం విశేషం.
అసత్య వార్తలను నమ్మవద్దు: కేంద్రం
ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ గడువులకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. గ్యాస్ బుకింగ్ నియమ నిబంధనలు మారాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ప్రస్తుతం అమల్లో ఉన్న గడువులే కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని అధికారులు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు సిలిండర్ డెలివరీ అయిన తర్వాత తదుపరి రీఫిల్ కోసం 25 రోజులకు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు ఈ గడువు 45 రోజులుగా ఉంది. ఈ కాలపరిమితుల్లో ఎటువంటి మార్పులు చేయలేదని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య వార్తలను నమ్మి పానిక్ బుకింగ్స్ చేయవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. దీంతోపాటు పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి సరిపడా నిల్వలు ఉన్నాయని వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర తెలిపింది.