Reading Time: 2 minutes

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవద్దని ఆయన సూచించారు. రా ష్ట్రంలో రెండు నెలలకు సరిపడా ఇంధన నిల్వలున్నాయని ఆయన స్పష్టం చేశారు. డ్రమ్ములు, కంటైనర్లలో పెట్రోల్ నింపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా, వాణిజ్య గ్యాస్‌కు కొంత ఇబ్బంది ఉందన్నది వాస్తవమేనని, దీనిపై కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని ఆయన వివరించారు. అక్రమంగా వినియోగిస్తున్న 2,952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ గృహ వినియోగదారులకు అవసరమైన ఎల్‌పిజి సమృద్ధిగా అందుబాటులో ఉందని, హైదరాబాద్ లో కొందరు పుట్టించిన పుకార్ల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రజలు పెట్రోల్, డీజిల్ లభ్యతపై ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్ సూచించారు.

1,200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నాం

బుధవారం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి అసెంబ్లీలోని తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయని ఆయన పేర్కొన్నారు. డిమాండ్‌ను మించి సరఫరా కొనసాగుతోందని, బుధవారం 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలోలీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. అంటే 652 కిలో లీటర్ల అదనపు నిల్వ మిగిలిందన్నారు. దీనికి తోడు అదనంగా 16,000 కిలోలీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతో పాటు 1,200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. వినియోగ దారులు గందరగోళంలో పడి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడంతో రోజు వారి డిమాండ్ ఒక్కసారిగా 25 శాతం పెరిగిందని, రోజువారీ సరఫరా సగటున పోల్చిచూసినప్పుడు ఎక్కడా అంతరాయం కలగకుండా అదనంగా 22 శాతం అందుబాటులో ఇంధన వనరులు నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు.

596 పెట్రోల్ బంక్‌లు నిరంతరాయంగా పని చేస్తున్నాయి

రాష్ట్ర రాజధానిలో 596 పెట్రోల్ బంక్‌లు నిరంతరాయంగా పని చేస్తున్నాయని, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఎక్కడ కుడా కొరత లేదని, అహ్మదాబాద్, సూరత్, బెంగుళూరు, ధారవాడ, బెల్గాం వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ,ప్రజలేవరు అయోమయానికి గురి కావొద్దని,వదంతులను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.