
పశ్చిమాసియా ఘర్షణల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్, అమెరికాకు హెచ్చరికలు జారీ చేసిన అనంతరం, అమెరికాకు చెందిన విమాన వాహన నౌక యూఎస్‌ఎస్ అబ్రహామ్ లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ లో వీడియోను కూడా విడుదల చేసింది. అయితే ఈ ఘటనపై అమెరికా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. ఇరాన్ సైన్యం పబ్లిక్ రిలేషన్స్ విభాగం ప్రకారం, తీర ప్రాంతం నుంచి ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులు అమెరికా యుద్ధనౌక దిశగా వెళ్లినట్లు పేర్కొంది. ఇది జరగడానికి ముందు, ఇరాన్ నౌకాదళం అమెరికాకు నేరుగా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ సముద్ర పరిధికి సమీపంలోకి వస్తే యూఎస్‌ఎస్ అబ్రహామ్ లింకన్‌ను లక్ష్యంగా చేసుకునే అవకాశముందని హెచ్చరించిన గంటలోపే దాడి చేసింది.
ప్రెస్ టీవీ నివేదిక ప్రకారం, ఇరాన్ నౌకాదళాధిపతి రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ, ఆ యుద్ధనౌక ఇరాన్ క్షిపణి పరిధిలోకి వస్తే దానిపై దాడి చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఆ నౌకను నిరంతరం గమనిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో, ఇరాన్ సైన్యాధికారులు అమెరికా ప్రభావాన్ని తక్కువగా చూపిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఖాతమ్ అల్-అన్‌బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారి, అమెరికా చెప్పుకునే వ్యూహాత్మక శక్తి ఇప్పుడు వ్యూహాత్మక వైఫల్యంగా మారిందని విమర్శించారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు ఇచ్చిన గడువును వెనక్కి తీసుకోవడం, పరిస్థితులను కొంత శాంతింపజేసే చర్యగా భావిస్తున్నారు. ఇరాన్ నుంచి ప్రతిదాడుల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.