Reading Time: < 1 minute

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల నెరవేరే సమయం ఆసమన్నమవుతున్న తరుణంలో సామాజిక న్యాయాన్ని కూడా పాటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఆ రిజర్వేషన్లలో ఒబిసి మహిళల కోసం సబ్ కోటా ఉండటం అంతే ముఖ్యం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును ప్రస్తుత లోక్‌సభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కవిత స్పందించారు. మహిళా బిల్లులో ఒబిసి మహిళలకు ఉప కోటా కల్పించకపోవడం అంటే మెజారిటీ ప్రజలను మోసం చేయటమే అని పేర్కొన్నారు. చట్టసభల్లో సామాజిక సమానత్వం రావాలంటే ఒబిసి మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు.

రిజర్వేషన్లలో రిజర్వేషన్ ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఒబిసి మహిళలకు ఉప కోటా లేకుండా ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తే మరోసారి పోరాటం తప్పదని హెచ్చరించారు. దేశంలో అన్ని వర్గాలకు మేలు చేయటమే సామాజిక న్యాయమని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఒబిసి వర్గాల మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే వారికి ఎలా న్యాయం దక్కుతుందని ప్రశ్నించారు. ఎస్‌సి,ఎస్‌టి మహిళలకు రాజ్యాంగబద్ద వాటా ఉందని…కానీ ఒబిసిల పరిస్థితి ఏంటనీ నిలదీశారు. ఈ విషయంలో అన్ని పార్టీల నాయకులు, ఆయా పార్టీల్లో ఉన్న ఒబిసి మహిళ నేతలు, మహిళా సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఒబిసి మహిళలకు ఉప కోటా కేటాయించే వరకు జాగృతి తరఫున మరోసారి పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.