
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని సమర్థిస్తూ.. “నేను ఉగాది, శివరాత్రి రోజులలో మాంసం తింటా. రాహుకాలాన్ని నమ్మను” అని అన్నారు. దీంతో ఆయన కొత్త రాజకీయ చర్చకు తెరలేపారు. చాలా మంది హిందువులు అశుభకరమైనదిగా భావించే ‘రాహుకాలం’ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిపక్ష నాయకులు విమర్శించడంతో ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
బుధవారం రాష్ట్ర శాసనసభలో సిఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. తాను రాహుకాలం వంటి భావనలను పాటించనని అన్నారు. అధికారులు, తన భార్యతో సహా కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాతే బడ్జెట్ సమయాన్ని నిర్ణయించానని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. అలాంటి కాలాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి తనకు ఎలాంటి సంకోచం లేదని, పాలన నిర్ణయాలు మూఢనమ్మకాలతో నడవకూడదని ఆయన చెప్పారు. జ్యోతిష్యపరమైన అంశాల కంటే ప్రజాస్వామ్య ప్రక్రియలకే తాను ప్రాధాన్యత ఇస్తానని ఆయన పేర్కొన్నారు.
ఉగాది, మహాశివరాత్రి వంటి పండుగలను హిందువులు భక్తికి చిహ్నంగా శాకాహారంతో జరుపుకుంటారు. అయితే, అటువంటి ఆచారాలు వ్యక్తిగత నమ్మకానికి సంబంధించిన విషయమని.. వ్యక్తిగత నమ్మకాలు వేర్వేరుగా ఉంటాయని, ఆహారపు అలవాట్లను మత ఆచారాలు ఎందుకు నిర్దేశించాలని ఆయన ప్రశ్నించారు. కాగా.. ఉగాది, శివరాత్రి వంటి పండుగల్లో మాంసాహారం తినడంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.