Reading Time: < 1 minute

బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురికీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారు పార్టీ ఫిరాయించలేదని ఈ నెల 11వ తేదీన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా స్పీకర్ నిర్ణయాన్ని

సవాల్ చేస్తూ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. బుధవారం హైకోర్టు వీటిని పరిశీలించి స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు ఇంకా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, టి. ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 16న విచారణ చేపడతామని, ఈ లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.