
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏర్పడిన గ్యాస్ కొరతను అవకాశంగా తీసుకొని కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎల్‌పిజి ఛార్జీలు, ఇంధన వ్యయం పేరుతో అదనంగా వసూలు చేయడం చట్టవిరుద్ధమని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సిసిపిఎ) తెలిపింది. అదనంగా సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తే.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
‘‘కొన్ని హోటళ్లు, రెస్టరెంట్లు వినియోగదారుల నుంచి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదులతో పాటు మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. మెనూలో పేర్కొన్న వాటికంటే అదనంగా వసూలు చేయవద్దు. అందులో పేర్కొన్నవే తుది ధరలు. అదనపు ఛార్జీల పేరుతో వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదు. వినియోగదారుల చట్టం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’’ అని సిసిపిఎ పేర్కొంది.