
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలనే ప్రభుత్వం ఆలోచన చేస్తుందని డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, బాలు నూనాయక్, కందుకూరు జయవీర్‌తో పాటు పలువురు సభ్యలు విద్యుత్ రంగంపై అడిగిన ప్రశ్నలకు డిప్యూటి సిఎం సమాధానం చెప్పారు. విద్యుత్ రంగంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేదిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ప్రభుత్వం పరిశీలన చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో గృహ ఉపయోగ, వ్యవసాయ రంగానికి సంబంధించి 81 గ్రామాల్లో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను చేపడుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 38,216 గ్రామాలు, 16,078 వ్యవసాయ పంప్ సెట్ లకు సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గృహ ఉపయోగ రూఫ్ టాప్ సోలార్ కింద, పీఎం సూర్యగర్ ప్రభుత్వ బిజిలీ కింద 40,349 గృహాల్లో 2 కే సామర్థ్యం రూప్‌టాఫ్ సోలార్ ఏర్పాటు చేశామని తెలియజేచేశారు. వ్యవసాయ సేవల్లో భాగంగా పిఎం కుసుమ కాంపోనెంట్ సి కింద 7.5 కిలోవాట్ హై రిజ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో16,708 వ్యవసాయ సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేశామని డిప్యూటి సిఎం పేర్కొన్నారు. అయితే పలువురు సభ్యలు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు, వ్యవసాయంలో రైతులు సాంప్రదాయ విద్యుత్ వినియోగం, మోటార్ వాడకానికి అలవాటు పడి సోలార్ అంటే అవగాహాన లేక, లేనిపోని అపోహలతో ముందుకు రావడం లేదని తెలిపారు. దీనిపై అధికారులతో విస్తృత అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భట్టి స్పందిస్తూ గతంలో అవగాహాన కార్యక్రమాలు నిర్వహించామని, వాటిని మరింత ఎక్కువగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.