Reading Time: < 1 minute

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రావాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావు సవాల్ విసిరారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లోని బిఆర్‌ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో హరీష్ రావు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తల కిందులు తపస్సు చేసినా మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, కెసిఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు.

అసెంబ్లీలో ఇంకా అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉన్నందున సమావేశాలను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఆయన స్పీకర్‌ను, ప్రభుత్వాన్ని కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే తాను మంత్రివర్గంలోకి తీసుకుంటానని ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా, సిద్దిపేట లో ఎవరో ఎందుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తనపై పోటీకి రావాలన్నారు. డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్ పెరిగితే స్వాగతిస్తామన్నారు.