Reading Time: < 1 minute

దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయాలను శనివారం లోగా (28 వ తేదీ)ఖాళీ చేయాలని ఎస్టేట్ విభాగం నోటీసు వెలువరించింది. 24 అక్బర్ రోడ్ ఆఫీసు, 5, రైసినా రోడ్డు భవనాలను ఈ ఉత్తర్వుల మేరకు పార్టీ ఖాళీ చేయాల్సి ఉంటుంది. దీనిని తమ ఫైనల్ నోటీసుగా గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు.అక్బర్ రోడ్‌లో దాదాపు 48 ఏండ్లుగా పార్టీ కార్యాలయం ఉంది. అయితే ఇది ప్రభుత్వ బంగళాగా ఉంది. ప్రభుత్వ బంగళాలలో పార్టీ కార్యాలయాలు ఉండరాదని మోడీ ప్రభుత్వం గతంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే పలు పార్టీలు సొంత ఆఫీసు భవనాలను ఏర్పాటు చేసుకున్నాయి. కాంగ్రెస్ కూడా స్థానికంగా ఇందిరా భవన్‌ను ఏర్పాటు చేసుకుంది. పాత భవనాన్ని ఖాళీ చేయలేదు.

అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 1978 నుంచి కాంగ్రెస్‌కు అక్బర్ రోడ్ కార్యాలయం ఉంది. పార్టీకి చెందిన యూత్ కాంగ్రెస్‌రైసినా రోడ్ కార్యాలయం నుంచి సాగుతున్నాయి. ఇటీవలే ఈ ఖాళీ ఉత్తర్వులతో నోటీసు వెలువడింది. కనీసం వారం రోజుల సమయం కూడా ఇవ్వలేదని పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ ఆకస్మిక నోటీసుపై ఏమి చేయాలనేది పార్టీ వర్గాలు ఇప్పటికైతే ఏమి నిర్ణయించుకోలేదు. అవసరం అయితే ఈ చర్యను నిలిపివేసేందుకు , స్టే తెచ్చుకునేందుకు కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. ప్రస్తుత విషయంపై నిబంధనల మేరకు స్పందిస్తామని, ఆలోచించుకుంటామని , ఇతరులకు వర్తించే రూల్స్ తమకూ వర్తిస్తాయని పార్టీ ఎంపి కార్తీ చిదంబరం తెలిపారు.