
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ భవనంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత ఈ సమావేశం ప్రారంభమైంది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, హర్దీప్ సింగ్ పురీ, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరయ్యారు. పశ్చిమాసియాలో తాజా పరిణామాలు, దేశ సన్నద్ధతపై నాయకులకు వివరించనున్నారు.
కాగా, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు జరిపడంతో సంక్షోభం ప్రారంభమైంది. ముఖ్యంగా ఇంధన సరఫరా, వాణిజ్య మార్గాలు, ప్రాంతీయ స్థిరత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ఘర్షణ ప్రభావం ప్రపంపై దీర్ఘకాలం కొనసాగవచ్చని ప్రధాని మోడీ గతంలో పార్లమెంట్‌లో హెచ్చరించారు. తలెత్తే సవాళ్లకు సిద్ధంగా ఉండాలని ఆయన పౌరులను, రాష్ట్రాలను కోరారు.
ఈ సంక్షోభం వల్ల కలిగే ప్రభావాలను ఎదుర్కోవడానికి, ఇంధన సరఫరా, ఎరువులు, సరఫరా గొలుసులు వంటి రంగాలను నిశితంగా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం పలు బృందాలను ఏర్పాటు చేసింది. దేశంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం, నిత్యావసర సేవలు సజావుగా కొనసాగేలా ఈ బృందాలు పనిచేస్తాయి.