
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ లభ్యత విషయంలో అపోహలను ప్రజలు నమ్మొద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయిల్ కంపెనీలు కూడా సరిపడా నిల్వలు ఉన్నట్లు చెబుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. వదంతుల కారణంగా పెట్రోల్, డీజిల్ ఎక్కువగా కొనుగోలు చేయడం వల్లే బంకుల్లో రద్దీ నెలకొందని తెలిపారు. క్యాన్లు, కంటెయినర్లలో ఇంధనాన్ని తీసుకెళ్లడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. అలా చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
‘‘ట్యాంకర్లు సకాలంలో రాకపోవడం వల్లే బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదు. వసతి గృహాలు, ఆస్పత్రులకు గ్యాస్ కొరత లేకుండా మానిటరింగ్ చేస్తున్నాం. హైదరాబాద్‌లో 596 పెట్రోల్ బంకులు పూర్తిగా పని చేస్తున్నాయి. ఏ బంకునూ మూసివేయడాన్ని అనుమతించం. కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్రంతో మాట్లాడుతున్నాం. చట్ట విరుద్ధంగా నింపిన 2,952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.