Reading Time: < 1 minute

జగిత్యాల: మాజీ మంత్రి, ఎంఎల్‌సి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం తన అనుచరులతో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి నుంచి అవమానాలతోనే గడిచిపోయిందని తెలిపారు. తన అనుచరుడు గంగారెడ్డిని నడి రోడ్డుపై నరికి చంపితే కాంగ్రెస్ అధిష్టానం, సిఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని విమర్శలు గుప్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించకపోవడంతో పాటు భరోసా కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని చూసినప్పుడల్లా బాధ తన్నుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబం కోసం తాను ఎంఎల్‌సిగా రోడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎంతకాలం అవమానాలు బరించాలని జీవన్ రెడ్డి నిలదీశారు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం కానీ, పార్టీ కానీ తనకు అండగా లేదని తనకు గౌరవం కావాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులపై 2024లోనే అధిష్టానానికి లేఖ రాశానని గుర్తు చేశారు. టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తనకు పోరాటం కొత్త కాదు అని, రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరుల అండదండలతోనే ఈ స్థాయికి ఎదిగానని, జగిత్యాలలో జరిగిన అభివృద్ధి కొడంగల్‌లో కూడా జరగలేదని ధ్వజమెత్తారు.